Two Years for Annamayya Project Washed Away: వరద ప్రభావిత గ్రామమైన అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పులపుత్తూరులో 2021 డిసెంబరు 2న పర్యటించిన సందర్భంగా బాధితులకు (Annamayya Project Flood Victims) జగన్ హామీలు ఇచ్చారు. వరద తాకిడికి ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ ప్రభుత్వమే 5 సెంట్ల స్థలం కేటాయించి ఇళ్లు కూడా నిర్మించి ఇస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చి రెండేళ్లయినా అతీగతీ లేదు. పులపుత్తూరు, తోగూరుపేట గ్రామాల్లో ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసినా ఏడాదిన్నర నుంచి పునాదుల దశ కూడా దాటలేదు. పులపుత్తూరులోని 3 లే అవుట్ లలో 323 ఇళ్లు, తోగూరుపేటలో 69 ఇళ్లు, రామచంద్రాపురంలో 56 ఇళ్లు మంజూరు చేశారు.
వీటికోసం 22 కోట్ల రూపాయలు మంజూరు చేసినా 50 శాతం ఇళ్లు పునాదుల దశ దాటలేదు. రెండేళ్ల నుంచి ఇళ్లు నిర్మిస్తారని ఎదురు చూసిన బాధితులు.. ప్రభుత్వం నిర్మించే ఉద్దేశం లేదని తెలుసుకుని ఊరు వదిలి చాలామంది వెళ్లిపోయారు. కొందరు అప్పులు చేసి ఇళ్లు నిర్మించు కుంటున్నారు. స్థోమత లేని నిరుపేదలు ఇప్పటికీ గుడారాల్లోనే బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
నదుల పునరుజ్జీవనానికి పాతరేసిన సర్కార్ - కేంద్రం సూచించినా పెడచెవిన పెట్టిన వైనం
కొండలు, గుట్టలపైన ఇళ్లు మంజూరు చేయడంతో బాధితులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.వరద ప్రభావిత గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తున్న గుత్తేదార్లకు బిల్లులు సరిగా చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి. వైకాపాలోని రెండువర్గాల మధ్య ఆధిపత్య పోరుకు బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.
అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులను రీడిజైన్ చేసి నిర్మించడమే కాకుండా.. నందలూరు వరకు రెండువైపుల రక్షణ గోడలు నిర్మిస్తామని జగన్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ ముందడుగు పడలేదు. వరద బీభత్సానికి కారణమైన నిర్మాణానికి సీఎం సన్నిహిత గుత్తేదారు కంపెనీ రాఘవ కనస్ట్రక్షన్‌కే పనులూ దక్కాయి.
660 కోట్ల రూపాయలతో ఆ కంపెనీ పనులు దక్కించుకుంది. కానీ ఇంకా పనులు ప్రారంభించలేదు. ఆకృతులూ ఖరాలు కాలేదు. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గతంలో పాతికేళ్లు పట్టింది. ఇప్పుడు ఎన్నేళ్లు పడుతుందో అర్థంకాని పరిస్థితి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే జగన్ నిధులు ఇవ్వని పరిస్థితి. ఇక అన్నమయ్య ప్రాజెక్టు ఎప్పటికి సాకారం అవుతోంది అర్థం కాని పరిస్థితి.
వరికపూడిశెల ప్రాజెక్ట్‌కు పూర్తి చేసి- పొలాలకు సాగు నీరు అందించండి మహోప్రభో!
జల ప్రళయానికి వరద బాధిత గ్రామాల్లో 271 మంది రైతులకు సంబంధించిన 127 హెక్టార్లలోని పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. ఇసుక తొలగించడానికి హెక్టారు 12,500 రూపాయలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినా నేటికీ అది నెరవేరలేదు. జాబ్ మేళాలకు 150 మంది నిరుద్యోగులు హాజరైనా.. కనీస వేతనం లేదని ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. చాలామంది పనులు లేక నందలూరు, రాజంపేట, కోడూరు ప్రాంతాలకు ఉపాధికి వెళ్తున్నారు .