మెుక్కల పెంపకంపై అవగాహన కల్పించాల్సిన ఉపాధ్యాయులే... స్వార్థ అధికారులతో చేరి చెట్లు నరికి వేస్తున్నారు. చిన్నపాటి కారణాలు చూపుతూ వందేళ్లుగా ఉన్న వృక్షాలను నరికేస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) కేంద్రం పచ్చటి చెట్లతో కళకళలాడేది. కేంద్రం ఆవరణలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాల కూడా కొనసాగుతోంది. అయితే పాఠశాలలో నాడు నేడు పనుల్లో భాగంగా ఉపాధ్యాయుడే గుత్తేదారుడిగా మారి డైట్ ఆవరణంలో ఉన్న 15 పెద్ద వృక్షాలను కొట్టివేసి కలపను తరలించేశారు. స్థానికులు దీన్ని వ్యతిరేకించినా రాజకీయ అండతో అందినకాడికి దోచుకున్నారా ఉపాధ్యాయుడు.
దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చెట్ల నరికివేత అత్యవసరమైన విషయాలను ఉన్నతాధికారులకు తెలిపి...టెండర్ ప్రక్రియ ద్వారా ద్వారా తొలగించాల్సి ఉన్నా ఆ నిబంధలు ఎవరు పాటించటం లేదు. విచ్చలవిడి వృక్షాలు నరికేస్తున్నా పట్టించుకోకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని డైట్ ఆవరణంలోని చెట్లు నరికివేతకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ విషయంపై డైట్ కళాశాల ప్రిన్సిపల్ రంగారెడ్డిని విచారించగా భవనాల పైకొచ్చిన చెట్లు తొలగించామని తెలిపారు. నాడు నేడు పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు చెట్లు కొట్టి వేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండీ...రుణం ఆశ చూపి.. లక్షలు దోచేశారు