వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చినా.. చికిత్స అందక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. కొవిడ్ బారిన పడిన కడప నగర శివారులోని రామరాజుపల్లెకు చెందిన శంకర్‌రెడ్డి వైద్యం కోసం బుధవారం రాత్రి సర్వజన ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో పడకలు లేవు.. ఖాళీ అయితేకానీ ఇవ్వలేమని అక్కడి సిబ్బంది బదులిచ్చారు.
కుటుంబీకులు సీపీఆర్ చేసినా..
గంట సేపు ఆస్పత్రి వద్దే నిలబడి నిరీక్షించిన శంకర్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గుండెలపై ఒత్తుతూ సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఎంత బతిమాలినా పట్టించుకోలేదు..
‘మా నాన్న తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు.. ప్రాథమిక చికిత్స అయినా చేయండి, అక్కడే ఉన్న ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ప్రాణవాయువు అందివ్వండని ఎంత బతిమాలినా ఒక్కరూ పట్టించుకోలేదు’ అని మృతుడి కుమారుడు రామశంకర్‌రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యులు పక్కనే ఉన్నా, నిర్లక్ష్యం చేసి నిండు ప్రాణాన్ని బలి గొన్నారని అల్లుడు సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : కొనసాగుతున్న కరోనా అల్లకల్లోలం: 11 జిల్లాల్లో వెయ్యికిపైగా కేసులు