Sitarama Kalyanam At Vontimitta : వైఎస్సార్ జిల్లాలో అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 30 నుంచి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జిల్లా జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ అధ్యక్షతన శుక్రవారం పరిపాలన భవనంలో టీటీడీ, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, కల్యాణ వేదికల వద్ద ఉత్సవ ఏర్పాట్లను వేగవంతం చేయాలన్నారు.
ఏప్రిల్ 5న సీతారాముల కల్యాణోత్సవం : ఈ నెల 30వ తేదీ నుంచి జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11 రోజులు పాటు ఒంటిమిట్టలో ఉత్సవాలను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5న తేదీన జరిగే సీతారాముల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి వీర బ్రహ్మం, జేసీ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తుండడంతో పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.
భక్తుల రవాణాకు ఆర్టీసీ బస్సులు : వచ్చే భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆహారం, నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా సక్రమంగా అందేటట్లు చూడాలని సూచించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల రవాణాకు అనువుగా ఆర్టీసీ బస్సులను నడపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కోదండరామ స్వామి దర్శనం చేసుకున్న జిల్లా జాయింట్ కలెక్టర్, టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర బ్రహ్మం స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఏఏస్పీ తుషార్ డూడి, సీఈ నాగేశ్వరావు, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముక కుమార్, శిక్షణ కలెక్టర్ రాహుల్ మీనా, కడప, బద్వేలు ఆర్డీఓలు ధర్మచంద్రా రెడ్డి, వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్ : ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 30న శ్రీరామనవమి, ఏప్రిల్ 3న హనుమత్సేవం, 4న గరుడ సేవ, 5న కళ్యాణోత్సవము, 6న రథోత్సవము, 7న అశ్వవాహనము, 8న చక్రస్నానం, 9న శ్రీపుష్ప యాగం జరగనున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి