అసాధారణంగా ఏకగ్రీవాలు మంచిది కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కడప జిల్లా అధికారులతో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏకగ్రీవాలపై షాడో బృందాలు కచ్చితంగా దృష్టి పెడతాయని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోటీ కావాలనే పార్టీలు.. పంచాయతీ ఎన్నికలప్పుడు మాత్రం ఏకగ్రీవాలు కావాలనడం ఎంత వరకు సమంజసమని ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రశ్నించారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారు కూడా ఎన్నికల్లో భాగస్వామ్యం అయినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని అన్నారు. అందుకే ఏకగ్రీవాలు వద్దని అంటున్నామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల ఆమోదంతో జరిగే ఏకగ్రీవాలకు ఎస్ఈసీ ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
పనిచేసే వారిపైనే విమర్శలు..
పనిచేస్తున్న వారిపైనే విమర్శలు ఎక్కువగా ఉంటాయని ఎసీఈసీ నిమ్మగడ్డ అన్నారు. తాను కూడా అందుకు మినహాయింపేమీ కాదన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తున్నందున తనపై విమర్శలు, ఆరోపణలు రావడం సహజమేని అన్నారు. తాను మాత్రం రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు.
ఎన్నికలు ఆపే శక్తి ఎవరికీ లేదు..
రాజ్యాంగం ప్రకారం తాను ఎన్నికలు నిర్వహిస్తుంటే... కొందరు పదేపదే అడ్డుకోవాలని చూడటం మంచిది కాదన్నారు. చివరి ప్రయత్నంగా నిన్న కూడా పది రిట్ పిటిషన్లు హైకోర్టులో వేసినా.. న్యాయస్థానం ఎన్నికలు నిర్వహించడానికే మొగ్గు చూపిందని తేల్చి చెప్పారు. ఇక రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిలుపుదల చేసే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. కడప జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ఎస్ఈసీ పేర్కొన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: