సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వచ్చి భోగి భాగ్యాలు ప్రసాదించే రోజుగా భోగికి పేరొచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఏడాదంతా ఇంటిల్లిపాదీ వ్యవసాయ పనుల్లో తలమునకలవుతారు. వ్యవసాయానికి వాడి అరిగిపోయిన పాత వస్తువులతో భోగి మంటలు వేస్తారు. రబీ పంటల కాలనికి కొత్త పరికరాలతో పనులు ప్రారంభించాలనేది దీని పరమార్థం. సంక్రాంతి సంబరాలు ఉట్టిపడేలా రంగవల్లులు వేసి చిన్న పిల్లలకు తలంటు స్నానాలు చేయిస్తారు. వారిపై రేగిపళ్లను పోస్తారు. దోశలు, ఆరెలు చేసి ఆరగిస్తారు.
పెద్దలను స్మరణ.. తర్పణాలు
పూర్వీకులను సంక్రాంతిలో స్మరించుకునే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు. రెండో రోజు జరుపుకొనే ఈ పండుగను పెద్దల పండుగగా చెప్పుకుంటారు. ఇంట్లో సిద్ధం చేసిన పిండివంటలతో పాటు కొత్త వస్త్రాలను పెద్దలకు సమర్పిస్తారు. ఏడాదిలో తొలిసారిగా కొత్త బియ్యపు వంటకాలను సూర్య దేవునికి సమర్పించి పెద్దలను స్మరించుకుంటూ తర్పణాలు వదులుతారు. సృష్టిలో కనిపించే దేవుడు సూర్యుడు, ఉత్తరాయణంలో ప్రవేశించే పుణ్య కాలంలో ఇలా చేయడం ద్వారా పరలోకంలో ఉన్న తమ పెద్దలకు స్వర్గప్రాప్తితో పాటు కుటుంబంపై పెద్దల ఆశీస్సులు లభిస్తాయనేది ప్రజల నమ్మకం. ప్రతి సంక్రాంతికి పెద్దలకు పితృతర్పణాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ తెలుగు సంప్రదాయానికి మకర సంక్రాంతి అద్దంపడుతోంది.
పెద్దన్నలకు పండగే
వ్యవసాయంలో రైతుకు తోడుగా నేనున్నానంటూ చేదోడుగా నిలబడే వృషభ రాజులు, పాడి పశువులను సంక్రాంతి సంబరాల్లో భాగం చేస్తారు. పండుగ చివరి రోజు (కనుమ) పశువుల పండగగా పిలుస్తారు. వ్యవసాయానికి ఉపయోగించే ఎద్దులకు స్నానం చేయిస్తారు. కొత్త ధాన్యంతో చేసిన పిండి వంటలు తినిపించి రంగులతో అలంకరిస్తారు. పశువుల గాడి చెంత పొంగళ్లు పెట్టి నాగళ్లను పూజిస్తారు. పూజలకు వాడిన పసుపు, కుంకుమలను పంటపొలాల్లో చల్లి, తొలి పంటను స్వాగతిస్తారు. చివరి రోజు కనుమ సాయంత్రవేళ ఊరి చివర కొలువై ఉన్న కాటమరాజు గుడి వద్దకు వెళ్లి పెళ్లి కాని యువతీ, యువకులు పూజలు చేసి ప్రసాదాలను స్వీకరిస్తారు. అలంకరించిన పశువులను పరుగులు తీయిస్తారు. సంక్రాంతి సంబరాలలో హరిదాసులు పాత్ర కూడా కీలకమే. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇంటి ముంగిటకు వచ్చారని జనం భావిస్తారు. ఆయన అక్షయ పాత్రలో ధాన్యం వేస్తే ఏడాదంతా సిరిసంపదలతో తులతూగుతారు అనేది నమ్మకం. ఖరీఫ్, రబీ పంటలు సాగు చేసిన రైతాంగం మూడు రోజుల విరామం తీసుకుని కోడిపందాలు, గంగిరెద్దుల ముత్యాలు, ఇతర పాటలతో ఆడిపాడి ఇంటిల్లిపాది ఆనందంగా గడపడం సంక్రాంతి శోభకు నిదర్శనం.
పండగ సంబరాలు..సగటు వ్యయం
కడప జిల్లాలో సంక్రాంతి పండుగ సంబరాలకు జనం పెట్టే ఖర్చు సగటున కుటుంబానికి రూ.30వేలు అనుకున్నా వ్యయం కోట్లలోనే ఉంటుంది. నాలుగు రోజుల ముందు నుంచే కొనుగోళ్లు మొదలు కావడంతో పట్టణాల్లోని వ్యాపార సముదాయాలు సందడిగా మారాయి. అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ధరలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారు. ప్రభుత్వపరంగా సేవలను అందించే ఆర్టీసీ సైతం రెట్టింపు చార్జీలు వసూలు చేస్తోంది. ధరల పెరుగుదలతో ప్రజలపై మరింత భారం పడుతోంది.
ఇదీ చదవండి: 'కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయాలి'