ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం అమలులో లోపాలున్నాయి. ఇందుకు ఉదాహరణ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం జిల్లా ఉన్నత పాఠశాల. అక్కడ నాణ్యమైన భోజనం అందించట్లేదని.. ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ఆ స్కూల్లో దాదాపు 1200 మంది చదువుతున్నారు. సగం మందికిపైగా విద్యార్థులు ఇంటి నుంచే క్యారియర్లు తీసుకొస్తున్నారు.
ఇదేమిటని పిల్లలను అడగ్గా.. పాఠశాలలో అందించే భోజనం సరిగ్గా లేకపోవటంతో ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నామన్నారు. మరికొందరైతే.. అసలు అక్కడ ఎప్పుడూ భోజనమే చేయలేదని చెబుతున్నారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయురాలిని చరవాణిలో వివరణ కోరగా.. ప్రతిరోజూ భోజనం బాగుంటుందని.. బియ్యం సరిగా లేకపోవడం వల్ల ఈ ఒక్కరోజే అన్నం సరిగ్గా ఉడకలేదని చెప్పారు. కరోనా కారణంగా ఎక్కువ మంది పిల్లలు ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్నారని తెలిపారు. పాఠశాలలో ఎంత మందికి భోజనం పెడితే అంతవరకే వివరాలు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జగన్ను నిలువరించడం భాజపాతోనే సాధ్యం: సోము వీర్రాజు