YS Viveka murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహం బాత్‌రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉండటం, ఆయన బెడ్‌రూమ్‌లో రక్తం చూసినప్పటికీ నుదుటిపై గాయాల్ని మాత్రం తాను గమనించలేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాశ్‌రెడ్డి సీబీఐకి వివరించారు. వివేకా నుదుటిపై రక్తం కనిపించిందని, అయితే తాను వృద్ధుణ్ని అయినందున గాయాల్ని గమనించలేకపోయానని తెలిపారు. రక్తపు వాంతులై ఉండొచ్చని భావించానని చెప్పారు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనతో రక్తపు వాంతుల విషయం చెప్పి ఉండొచ్చని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 16న ఆయన సీబీఐ అధికారుల ఎదుట వాంగ్మూలమిచ్చారు. అందులోని ప్రధానాంశాలివి.
పోస్టుమార్టం చేయించే ప్రణాళిక లేదు..
2019 మార్చి 15న ఉదయం 6.30కు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఫోన్ చేసి వివేకా చనిపోయారని నాకు చెప్పారు. ఎలాగని చెప్పలేదు. 7గంటల సమయంలో నేను వివేకా ఇంటి వద్దకు చేరా. నేరుగా బెడ్‌రూమ్‌లోకి వెళ్లా. ఎం.వి.కృష్ణారెడ్డి అక్కడున్నారు. ఆయన కాకుండా ఇతరులెవరినీ నేను లోపల చూడలేదు. బెడ్‌రూమ్‌లో రక్తం చూసి బాత్‌రూమ్ వైపు వెళ్లా. రక్తపు మడుగులో వివేకా మృతదేహం పడి ఉంది. రక్తపు వాంతులు అయ్యుండొచ్చని భావించా. నుదుటిపై రక్తం ఉండటంతో గాయాల్ని గమనించలేదు. బెడ్‌రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఎర్ర గంగిరెడ్డి లోపలికి వెళ్తున్నారు. ఎంవీ కృష్ణారెడ్డి, ఒక కానిస్టేబుల్ లోపలున్నారు. కాంపౌండ్ లోపల జనసమూహం ఏర్పడింది. ప్రత్యేకించి ఎవరినీ చూడలేదు. వివేకా మృతదేహానికి బ్యాండేజీలు ఎవరు వేశారనేది నాకు తెలియదు. 15-20 నిమిషాలు అక్కడ ఉండి వచ్చేశా. నేను వివేకా ఇంట్లో ఉన్నంతవరకూ మృతదేహానికి పోస్టుమార్టం చేయించాలన్న ప్రణాళిక ఏమీ లేదు. మళ్లీ ఉదయం 11.30కు నేను వివేకా ఇంటి వద్దకు వెళ్లా. నుదుటిపై గాయాలుండటంతో పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారని తెలిసింది. రాజంపేట మాజీ ఎంపీ సాయి ప్రతాప్‌తో కలిసి ప్రభుత్వాసుపత్రికి వెళ్లా. అప్పుడే మృతదేహాన్ని, గాయాల్ని చూశా. ఆయన గుండెపోటుతో మరణించారనే ప్రచారం ఎవరు ప్రారంభించారో నాకు తెలియదు. వివేకా హత్యకు గురయ్యారన్న సంగతి ఆసుపత్రికి వెళ్లాకే నాకు తెలిసింది. నేను మూడు సార్లు వివేకా ఇంటికి వెళ్లా. ఆ సమయంలో మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను గమనించలేదు. వివేకా మృతదేహాన్ని చూడటం వల్ల ఆందోళనకు గురయ్యా. దీంతో ఎవరినీ సరిగ్గా చూడలేకపోయా. నా వయసు 78 ఏళ్లు. వృద్ధాప్యం వల్ల నేను విషయాలు మరిచిపోతుంటా. - వైఎస్ ప్రకాశ్‌రెడ్డి
ఇదీ చదవండి: YS Viveka Case: వివేకా రక్తపు వాంతులతో చనిపోయినట్లు వైఎస్ మనోహర్‌రెడ్డి చెప్పారు: ప్రతాప్‌రెడ్డి