పర్యావరణ పరిరక్షణలో కీలకమైనది పచ్చదనమే. పచ్చదనం పెంపునకు ప్రభుత్వాలు వేల కోట్లు వ్యయం చేస్తున్నా ఆశించిన ఫలితం కనిపించటం లేదు. కడప జిల్లాలో ప్రతి వర్షాకాలంలోనూ లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతున్నట్లు యంత్రాంగం చెబుతోంది. ఇందులో సంరక్షణ శాతంపై అనేక మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటడం, సంరక్షించే బాధ్యతను గతంలో వెలుగు మహిళలకు అప్పగించారు. ప్రస్తుతం ఈ బాధ్యతను ఉపాధి కూలీలకు అప్పగిస్తున్నారు. ఇలా తరచుగా బాధ్యతలు మార్చుతుండటం వల్ల పచ్చదనం పెంపుదలకు అడ్డంకులు ఎదురవుతాయని భావిస్తున్నారు.
● రాష్ట్రంలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం 2020-2021 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో పంచాయతీకి 2 కి.మీ. చొప్పున మొత్తం 812 పంచాయతీల్లో 1570 కి.మీటర్ల పరిధిలో మొక్కలు నాటి సంరక్షించాలని నిర్దేశించింది. ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యంలో భాగంగా జూన్ చివరి నాటికి సుమారు 987 కిలోమీటర్లను గుర్తించారు. ఈ మేరకు అనుమతులకు సిద్ధం చేశారు. మొత్తంగా కిలోమీటరుకు 400 చొప్పున 6,28,000 మొక్కలు నాటనున్నారు.
● మొక్కల సంరక్షణ బాధ్యతను స్థానిక ఉపాధి కూలీలకు అప్పగించనున్నారు. ఒక్కొక్క కూలీ సగటున 100 మొక్కల సంరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ కూలీకి 100 పని దినాలను కల్పించి వేతనం ఇవ్వనున్నారు.
● జిల్లావ్యాప్తంగా జులై 7వతేదీ నాటికి 1570 కి.మీటర్లలో మొక్కలు నాటేందుకు సంబంధించిన అనుమతులు ఇవ్వనున్నారు. అనుమతులు పొందిన పంచాయతీల్లో జులై 25వ తేదీ నాటికి మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను స్థానిక ఉపాధి కూలీలకు అప్పగిస్తారు.
శాఖల మార్పుతో ..
గతంలో కూడా ఉపాధి పథకం కింద మొక్కలు నాటి, సంరక్షించేవారు. 2017-2018లో అప్పటి ప్రభుత్వం మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలను పొదుపు మహిళలకు అప్పగించింది. ప్రస్తుతం మళ్లీ ఉపాధి శాఖకు మార్చారు.
● 2017-2018లో జిల్లాలోని 175 పంచాయతీల్లో 718 కి.మీటర్ల పరిధిలో లక్షల సంఖ్యలో మొక్కలు నాటారు. వాటి సంరక్షణ బాధ్యతను అప్పట్లో వెలుగు ఆధ్వర్యంలోని పొదుపు మహిళలకు అప్పగించారు. దీనికి సంబంధించి మొక్కకు 50 పైసల చొప్పున చెల్లించారు.
● బద్వేలు నియోజకవర్గంలో 84 పంచాయతీలున్నాయి. 168 కి.మీటర్లలో మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే సంబంధిత పంచాయతీల్లో ఏపీవోల ఆధ్వర్యంలో స్థలాలను గుర్తించి అనుమతుల కోసం జిల్లా అధికారులకు పంపారు.
● రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన ప్రాంతం మండల పరిధిలోని బెడుసుపల్లె గ్రామం నుంచి దిన్నెమీదిపల్లెకు వెళ్లే రహదారి. ఈ రహదారికి ఇరువైపులా 2018లో 200 మొక్కలు నాటారు. మొదట్లో సంరక్షణ చేపట్టిన మహిళలు ఆపై మరిచారు. పైగా ఏడాది క్రితం రోడ్డు విస్తరణ పనులు చేపట్టి బతికిన అరకొర మొక్కలపై రోడ్డు పనులు చేపట్టారు. దీంతో చేసిన పనులు వృథాతోపాటు ప్రభుత్వ సొమ్ము మట్టిపాలైంది.
● మొక్కల పెంపకంలో భాగంగా బద్వేలు నియోజకవర్గంలోని బి.కోడూరు ప్రధాన రహదారిపై మొక్కలు నాటారు. ఉపాధి పథకం ద్వారా సుమారు అర కిలోమీటరు దూరం మేర 100 మొక్కలు నాటారు. ఈ మొక్కల సంరక్షణను స్థానిక ఉపాధి కూలీలు చేపడుతున్నారు.
పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కలు నాటడం, పెంపకాన్ని ఉపాధి ద్వారా చేపడుతున్నాం. ఇప్పటికే జిల్లాలోని అన్ని పంచాయతీల్లో సంబంధిత స్థలాలను గుర్తించాం. గతంలో వెలుగు ఆధ్వర్యంలో చేపట్టిన స్థలాల్లో మొక్కలు నాటబోం. పంచాయతీకి 2 కి.మీటర్ల చొప్పున జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటుతాం. స్థానిక ఉపాధి కూలీలకు వాటి నిర్వహణ బాధ్యతను అప్పగిస్తాం. - బ్రహ్మానందరెడ్డి, ఉపాధి హామీ పథక సహాయ సంచాలకులు, బద్వేలు క్లస్టర్.
ఇవీ చదవండి...