యోగివేమన విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు రాయలసీమ ఆధునిక తెలుగు సాహిత్యం, గ్రామీణ సంస్కృతిపై జాతీయ సదస్సు, గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ క్రీడలు, సాహిత్యం, రైతు జీవనం, కులవృత్తులు, పండగలపై వక్తలు కీలక ఉపన్యాసాలు ఇచ్చారు. విశ్వవిద్యాలయ ఆచార్యులతో పాటు ఇతర బాషా సాహితీవేత్తలు, విమర్శకులు, రచయితలు పాల్గొన్నారు. ఆనాటి సీమ సంస్కృతిని తెలియజేశారు. కొన్ని సంవత్సరాల క్రితం కరవుతో అల్లాడిన సీమ పరిస్థితిని, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు. అప్పటి గ్రామాల పరిస్థితి, ప్రజల జీవన విధానం, వారి సంస్కృతిని వక్తలు నేటి తరానికి తెలియజేశారు. యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి సూర్యకళావతి ఆధ్వర్యంలో నిర్వహించి సదస్సుకు ప్రముఖ సాహితీ వేత్త రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, విశ్రాంత ఆచార్యులు చిగిచర్ల కృష్ణారెడ్డి తోపాటు, సీమలోని 4 జిల్లాలకు చెందిన రచయితలు, కవులు, తెలుగు భాషాభిమానులు హాజరయ్యారు.
పాత వస్తువుల ప్రదర్శన
ఈ సదస్సులో చేతివృత్తులు, వ్యవసాయ పనిముట్లు, కనుమరుగైపోయిన వస్తువులన్నింటిని ప్రదర్శించారు. వీటిలో చాలావరకు నేటి తరానికి తెలియనివే ఉన్నాయి. ఈ ప్రదర్శనలో చేతివృత్తులు, గ్రామీణ పనిముట్లు, కుటీర పరిశ్రమ, బొమ్మల కొలువు, కుమ్మరి సారె, ఎద్దులబండి, మగ్గం, రాట్నం మెుదలగునవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముస్లిం విద్యార్థులు ప్రదర్శించిన వస్తువులలో పురాతన కాలం నాటివి ఉన్నాయి. 1850 నాటి ఖురాన్ పెట్టె, గడియారం, 1890 నాటి ట్రే, 1900 నాటి సురాహి, పాన్ దాన్, అత్తరు, హుక్కా, గంధం రాయి ఆకట్టుకున్నాయి. పూర్వ కాలంలో వినియోగించిన నాణాలతో పాటు, విదేశీ నాణాలు, నోట్లు ప్రదర్శించారు. రాయలసీమ ఆధునిక తెలుగు సాహిత్యాన్ని బతికించుకోవడానికి రచయితలు, సాహితీవేత్తలు కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జాతీయ సదస్సులో తీర్మానం చేశారు. గురువారం కూడా సదస్సు జరగనుంది.
ఇదీ చదవండి: