తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ చెట్లను పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టి.. అందరికీ ఆరోగ్యకరమైన ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసే ప్రక్రియే మియావాకి అడవుల పెంపకం. కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో 2019 డిసెంబరులో మియావాకి పద్ధతిలో అడవులను పెంచాలనే జిల్లా అధికారుల నిర్ణయించారు. ఈ మేరకు అటవీశాఖ సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో పది ఎకరాల విస్తీర్ణంలో లక్షకు పైగానే మొక్కలను నాటారు.
కేవలం రాయలసీమ జిల్లాలు, తూర్పు కనుమల్లో లభించే అరుదైన మొక్కలను ఏరికోరి దాదాపు 25 నుంచి 30 జాతుల మొక్కలను మియావాకి పద్ధతిలో నాటారు. ఉపాధి హామీ పథకం కింద 70 లక్షల రూపాయలు వెచ్చించి.. రోజుకు వందల మంది కూలీలతో మొక్కలను నాటించారు. 9నెలల్లోనే మొక్కలు ఏపుగా పెరిగి పది ఎకరాల అడవి పచ్చగా కళకళలాడుతోంది. సాధారణంగా అడవుల్లో పెరిగే మొక్కలు పెద్దవిగా మారి దట్టమైన అడవులుగా రూపాంతరం చెందాలంటే దాదాపు 300 సంవత్సరాలు పడుతుంది. కానీ.. మియావాకి పద్ధతిలో కేవలం 20 ఏళ్లలోనే అడవులు వృద్ధి చెందుతాయని అటవీశాఖ అధికారులు తెలిపారు.
అరుదైన మొక్కల పెంపకం
కడప మియావాకి అడవుల్లో ఎర్రచందనం, మోదుగ, ఉసిరి, మద్ది, నారేపి, రేల, తెల్లమద్ది, రావి, పారిజాతం, ఇండియన్ రోజ్ వుడ్, గంగరావి, దానిమ్మ, జామ వంటి అనేక రకాల జాతుల మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. సాధారణ పద్ధతిలో కంటే.. మియావాకి పద్ధతిలో మొక్కలు నాటిన మొక్కల‌్లో ఎదుగదల పదిరెట్లు ఉంటుంది. ఓ సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొక్కల్లో సగటున ఒక మనిషికి 422 మొక్కలు ఉన్నాయి.
కానీ.. మన భారతదేశం జనాభా ప్రకారం ఒక మనిషికి కేవలం 28 మొక్కలు మాత్రమే ఉన్నట్లు తేలింది. అయితే కడప యోగివేమన విశ్వవిద్యాలయంలో మియావాకి పద్ధతి ద్వారా పెరిగిన లక్ష మొక్కలను లెక్కిస్తే... అక్కడి విద్యార్థులు, ఆచార్యులు, సిబ్బందికి ఒక్కొక్కరికి 86 మొక్కలు సగటున ఉన్నాయని వృక్ష శాస్త్ర ఆచార్యులు అంచనా వేశారు.
దేశంలోనే ప్రథమం
మొక్కలు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా మానవ మనుగడకు ఎంతగానే ఉపయోగపడతాయని కడప యోగివేమన ఉప కులపతి సూర్య కళావతి అన్నారు. తమ విశ్వవిద్యాలయంలో 10 ఎకరాల్లో పెంచుతున్న మియావాకి అడవులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. నాగరిక ప్రపంచంలో చెట్లు కొట్టేయటంతో కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో చిన్న నగరాల్లో కూడా మియావాకి పద్ధతిలోనే మొక్కలు పెంచడం ద్వారా... ఎన్నో ఉపయోగాలుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.