కడప జిల్లాలో కొవిడ్ -19 పరిస్థితులపై మంత్రులు ఆళ్లనాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్ సమీక్షించారు. జిల్లాలో కేసులు నమోదవుతున్న తీరు, తీసుకుంటున్న నివారణ చర్యలపై అధికారులతో మాట్లాడారు.
కడప జిల్లాలో ఇవాల్టి వరకు 664 కేసులకు సంబంధించి నమూనాలు సేకరించామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇందులో 27 పాజిటివ్ కేసులు రాగా.. 399 నెగిటివ్ వచ్చాయని వెల్లడించారు. కొవిడ్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనాపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
వ్యవసాయం, ఆక్వా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు. భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కరోనా నివారణకు అన్ని రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక సలహాలివ్వాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే విమర్శలు చేయటం సరికాదని చెప్పారు. కడప జిల్లాలో టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశామన్న మంత్రి... రేషన్ కార్డుదారులకు రూ.వెయ్యి పంపిణీ విజయవంతమైందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయించి షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: