కడప జిల్లాలో బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బంగా రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు దాదాపు 5 వేల మంది ఉంటారని అంచనా. కడప నగరంలోనే 2 వేల మందికి పైగానే ఉన్నారని సమాచారం. ప్రొద్దుటూరు పట్టణంలో 1574 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇక్కడ అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 871 మంది ఉన్నారు.
రాయచోటి రోడ్డు, రాజంపేట బైపాస్ రోడ్డు ప్రాంతాల్లో వలస కార్మికులు గుడారాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అలాగే.. బీహారీలు బతుకు దెరువు కోసం కడప నగరానికి 40 మంది వచ్చారు. ఎవరైనా దాతలు నిత్యావసర వస్తువులు, భోజనం ప్యాకెట్లు అందిస్తే.. వాటితోనే పొట్ట నింపుకుంటున్నారు. ఇలాంటివారు చాలా మందే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులను తరలించడానికి శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసింది. కానీ.. కడప రైల్వే స్టేషన్ నుంచి ఏ రైలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి అందుబాటులో ఉంచడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశ్సా రాష్ట్రాలకు వెళ్లాల్సిన వలస కూలీలను రెండు రోజులుగా కొంతమందిని తిరుపతి, కర్నూలు రైల్వేస్టేషన్ల నుంచి తరలించారు.
కడప నగరంలో బీహార్ ప్రాంతానికి చెందిన వారు పది రోజుల కిందట స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. వారికి ఇంకా పిలుపు రాలేదు. తమను ఎపుడు తరలిస్తారోననే ఆందోళన వారిని వెంటాడుతోంది. ఇక్కడ తమకు తినడానికి తిండి దొరకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్... తమను ఇక్కడి నుంచి తరలించే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: