కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో హెటిరో డ్రగ్స్ కంపెనీ నిర్వాహకులు చేపట్టిన నాడు- నేడు పనులు నాణ్యతగా లేవని జమ్మలమడుగు మండల విద్యాశాఖ అధికారిణి సావిత్రమ్మ ఆరోపించారు. జరిగిన పనులను పరిశీలించాలని ఏకంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని బహిరంగ సమావేశంలో కోరడంతో ఆయన అవాక్కయ్యారు. గురువారం జమ్మలమడుగు లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఈ సందర్భంగా ఎంఈఓ సావిత్రమ్మ మాట్లాడమని అవకాశం ఇచ్చారు.
కడప జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వమే.....ప్రభుత్వ పాఠశాలలో నాడు- నేడు పనులు చేస్తోందని.. ఒక్క జమ్మలమడుగులో మాత్రం హెటిరో డ్రగ్స్ కంపెనీ నిర్వాహకులు చేపట్టినట్లు పేర్కొన్నారు. జమ్మలమడుగు మండలంలో 22 ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు పనులు జరుగుతున్నాయని మొత్తం పనుల్లో నాణ్యత లేదని.. ఓ సారి పరిశీలిస్తే డొల్లతనం బయటపడుతుందని సూచించారు. బహిరంగ సమావేశంలోనే ఈ విషయం చెప్పడంతో ఎమ్మెల్యే నిర్ఘాంతపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాసిరకంగా పనులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వారిని హెచ్చరిస్తే మిగిలిన పనులైనా బాగు చేస్తారని సూచించారు.
ఇదీ చదవండి: