Land Irregularities With Kadapa District Collector Signature : సీఎం సొంత నియోజకవర్గంలోనే భారీ భూ కుంభకోణం బయటపడింది. జిల్లా కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి వందల కోట్ల రూపాయల విలువైన భూమిని నకిలీ ఎన్‌వోసీలతో రిజిస్ట్రషన్ చేసినట్లు గుర్తించారు. ఈ కుంభకోణంలో పులివెందుల, కడప రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. సుమారు 35 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మోసపోయిన వ్యక్తుల్లో సీఎం సమీప బంధువు కూడా ఉన్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందులలో భారీ భూకుంభకోణం జరిగింది. 100 కోట్ల విలువైన చుక్కల భూములకు నకిలీ నిరభ్యంతర పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ అక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, రెవెన్యూ శాఖలో కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ దందా జిల్లా కలెక్టర్ విజయరామరాజు దృష్టికి వెళ్లింది.
తన సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు తన అనుమతి లేకుండా ఎన్‌వోసీలు జారీ కావడాన్ని ఆయన గుర్తించారు. ఈ మేరకు ప్రాథమిక విచారణలో 12 ఎన్‌వోసీలతో 35 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. వీటిని వెంటనే రద్దు చేయాలంటూ పులివెందుల తహసీల్దార్ కల్లూరి మాధవ కృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.
పులివెందులకు చెందిన పత్తి నాగేశ్వరరావుకు కె.వెలమవారిపల్లె గ్రామం సర్వే నంబరు 99/3లో ఉన్న 2.98 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రిజిస్ట్రేషన్ల రద్దుకు ప్రక్రియ నడుస్తోంది. ఈ అక్రమంపై పోలీసులకు ఆర్డీవో వెంకటేశులు, తహసీల్దార్ శనివారం ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో స్థిరాస్తి దళారీ శ్రీపతి శ్రీనివాస్, వీఆర్వో కళానంద్‌రెడ్డి, సర్వేయర్లు సందీప్‌రెడ్డి, వాసుదేవరెడ్డిల పాత్ర ఉన్నట్లుగా గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని ఈ భూమి మార్కెట్ విలువ 2 కోట్ల 89 లక్షలు ఉంటుందని అధికారులు తేల్చారు. డీకేటీ పట్టా తీసుకున్న లబ్ధిదారు.. తన భూమిని విక్రయించుకునేందుకు కలెక్టరు నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇందుకోసం కొందరు కలెక్టరు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌వోసీలతో దందా సాగించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన మేరకు భూదందా విలువ 100 కోట్ల వరకూ ఉంది. ఈ తరహాలో జరిగిన క్రయ విక్రయాల్లో మోసపోయిన వ్యక్తుల్లో సీఎం జగన్ సమీప బంధువులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Land Occupation: ఆ మంత్రుల నియోజవర్గాల్లో యథేచ్ఛగా భూ అక్రమాలు..
పులివెందుల పురపాలక సంఘం పరిధిలో భూముల విలువ భారీగా పెరిగింది. అవుటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత.. భూముల ధరలు మరింతగా పెరిగాయి. అక్కడే కె.వెలమవారిపల్లెలో సర్వే నంబరు 99/3లో 2.98, 99/1లో 4.26, 98/1లో 1.07, అహోబిలపురంలో 2/2ఎలో 4.55, 45/2లో 4.8, యర్రగుడిపల్లెలో 135/2లో 3, 135/2లో 3.87, బాకరాపురంలో 58/2లో 4.91, బ్రాహ్మణపల్లెలో 48/3లో 1.41, చిన్నరంగాపురంలో 220/2లో 3.51 ఎకరాల వంతున మొత్తం 34.36 ఎకరాల భూమికి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 7న నకిలీ ఎన్‌వోసీలు జారీ అయ్యాయి. కలెక్టరు కార్యాలయంలో ఓ అధికారి అండదండలతోనే ఇవి జారీ అయినట్లు అనుమానిస్తున్నారు. పులివెందులలో ఎకరం రూ.3 కోట్ల వరకు ధర పలుకుతోంది. పులివెందుల పురపాలక పరిధిలో కె.వెలమవారిపల్లె, అహోబిలపురం, యర్రగుడిపల్లె, బాకరాపురం, బ్రాహ్మణపల్లె, చిన్నరంగాపురం గ్రామాల్లో చుక్కల భూములున్నాయి. ఈ భూములకు రిజిస్ట్రేషన్ జరగడంతో ఇవి పట్టా భూములుగా మారిపోయాయి. రిజిస్ట్రేషన్ తర్వాత ఇళ్ల స్థలాల కోసం ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు.
జగనన్న కాలనీ భూముల్లో క్విడ్ ప్రో కో.. వెలుగులోకి మంత్రి ఉష శ్రీ చరణ్ అక్రమాలు.!