కడప నగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖపట్నం బస్సు సర్వీసు గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఎప్పటి నుంచో వైజాగ్‌కు బస్సు ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నా.. కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు రేపు బస్సు సర్వీసును ప్రారంభించనున్నారు.
మధ్యాహ్నం మూడు గంటలకు కడప నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వైజాగ్ నుంచి కడపకు బయల్దేరుతుంది. ఆధునిక సౌకర్యాలతో డాల్ఫిన్ క్రూజర్ వోల్వా బస్సును అధికారులు ఏర్పాటు చేశారు. 46 మంది ప్రయాణికులు కూర్చునే వీలుండగా పెద్దలకు ఒక్కొక్కరికి 1612 రూపాయలు, పిల్లలకు ఒకరికి 1209 రూపాయలు చొప్పున టిక్కెట్ కేటాయించారు. కడప వయా మైదుకూరు బద్వేల్, కావలి, ఒంగోల్, గుంటూరు, విజయవాడ, అన్నవరం, అనకాపల్లి, తుని మీదుగా వైజాగ్ చేరుకుంటుంది. నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.
ఇదీ చదవండి: అన్నమయ్య జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ