కడప జిల్లాకు జాతీయ జల అవార్డు (నేషనల్ వాటర్ అవార్డ్స్-2020)లో చోటుదక్కింది. 2020 సంవత్సరానికి సంబంధించి మొత్తం 11 విభిన్న విభాగాల్లో 57 అవార్డులు ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఒక్క జిల్లాకే అవార్డు వచ్చింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం ప్రకటించిన అవార్డుల్లో జల సంరక్షణలో దక్షిణాది నుంచి కేరళలోని తిరువనంతపురం జిల్లా మొదటిది స్థానం దక్కించుకోగా.. రెండో ‘ఉత్తమ జిల్లా’గా కడప బహుమతి గెలుచుకొంది.
రాష్ట్రాల విభాగంలో ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు మొదటి మూడు అవార్డులు సొంతం చేసుకున్నాయి. నీటి సంరక్షణకు కృషి చేసిన జిల్లాలు, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, పాఠశాలలు, గృహ సంక్షేమ సంఘాలు, మతపరమైన సంఘాలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, నీటి వినియోగ సంఘాలకు ఈ అవార్డులు ఇస్తున్నారు. ఈ సారి ఒక్క కేటగిరీలో మినహా మిగిలిన ఏ విభాగంలోనూ తెలుగు రాష్ట్రాలకు స్థానం దక్కలేదు.
ఉత్తమ మీడియా విభాగంలో ‘నెట్‌వర్క్ 18’ ప్రసారం చేసిన ‘మిషన్ పానీ’ నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఏటా 1,100 శతకోటి ఘనపు మీటర్ల మేర ఉన్న నీటి అవసరం 2050కల్లా 1,447 శతకోటి ఘనపు మీటర్లకు చేరుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో 18% జనాభా భారత్‌లోనే ఉన్నా.. నీటి వనరులు కేవలం 4% మాత్రమే ఉన్నాయని చెప్పారు. అందుకే నీటి సంరక్షణకు అసాధారణ రీతిలో పనిచేసే సంస్థలను ప్రోత్సహించేందుకు 2018 నుంచి జాతీయ అవార్డులు ఇస్తున్నామని, ఈ అవార్డులు మూడో ఏడాదివని అన్నారు. దక్షిణాదిలో తమిళనాడుకు 6, కేరళ, కర్ణాటకకు రెండేసి అవార్డులు దక్కాయి.
ఇదీ చదవండి: