కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామం గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురి కానుంది. శ్రీశైలం వెనుక జలాల నుంచి అవుకు రిజర్వాయర్ కు పంపి అక్కడి నుంచి గాలేరు-నగరి కాలువ ద్వారా గండికోట జలాశయానికి పంపిస్తున్నారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 10 టీఎంసీలు దాటింది. పూర్తి సామర్థ్యం 26 టీఎంసీలు ఉండగా కనీసం ఇరవై మూడు టీఎంసీల నింపేందుకు ప్రభుత్వం భావిస్తోంది. గండికోట జలాశయంలో 10 టీఎంసీలు దాటితే తాళ్ల పొద్దుటూరు గ్రామానికి ఆ జలాలు చేరుతాయి.
ఈ గ్రామంలో మొత్తం 2869 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 1104 మంది పునరావాసం కావాలని, 1,765 మంది ఒకేసారి డబ్బులు చెల్లించాలని కోరుకున్నారు. వీరిలో కొంతమందికి మాత్రమే పరిహారం చెల్లించారు. వన్ టైం సెటిల్మెంట్ కింద పది లక్షలు రూపాయలు, పునరావాసం కోరుకున్న వారికి ఏడు లక్షల రూపాయలతో పాటు ఐదు సెంట్ల స్థలం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. చాలామందికి పరిహారం చెల్లించలేదు. వీరందరికీ అక్టోబర్ 14 లోగా ఖాళీ చేయమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇంత తక్కువ సమయంలో గ్రామాన్ని ఖాళీ చేయడం కుదరదని గ్రమస్థులు అనేకమార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. అవేమీ పట్టించుకోకుండా గురువారం జేసీబీలతో ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నించారు. దీన్ని నిరసిస్తూ తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ , సీపీఐ నాయకులు నిర్వాసితులకు మద్దతు తెలిపారు.
గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు వందల సంఖ్యలో తాళ్ల పొద్దుటూరు ప్రధాన రోడ్డుపై చేరుకుని ఆందోళన చేస్తూనే ఉన్నారు . కడప నుంచి ఉన్నతాధికారులు వచ్చి పరిహారం విషయంలో మాట ఇస్తారు అనుకుంటే ఎవరూ రాలేదు. తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులు మాత్రం తమ పట్టు విడవకుండా వర్షం పడుతున్నా రోడ్డుపై బైఠాయించారు. కనీసం ఆరు నెలల గడువు ఇస్తే గ్రామాన్ని ఖాళీ చేస్తామని చెబుతున్నారు. పరిహారం చెల్లించనివారికి చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశార. అలా కాకుండా బలవంతం చేస్తే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరించాయి
గండికోట ముంపు వాసుల బాధను అర్థం చేసుకొని వారు కోరుకున్న విధంగా పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
ఇదీ చదవండి: "ఊరికి మొనగాళ్లు" పేరిట కథనం... స్పందించిన ప్రభుత్వం