కడప జిల్లా రాయచోటిలో వెలసిన వీరభద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా నైవేద్య ఘట్టం వైభవంగా జరిగింది. స్వామి వారి ప్రధాన ఆలయంలో వీరశైవులు వండిన మహా నైవేద్యాన్ని రాశిగా పోశారు. ఒడియా రాజులు నైవేద్యాన్ని పొందిన తర్వాత.. విభూతి రుద్రాక్ష మాలలు ధరించిన భక్తులు మహా నైవేద్యాన్ని పొందేందుకు భారీగా దూసుకొచ్చారు. హర హర మహాదేవ అంటూ భక్తి పారవశ్యంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టంగా కొనసాగుతూ వస్తున్న ఈ సన్నివేశాన్ని తిలకించి... స్వామివారి ప్రసాదాన్ని పొందేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
నైవేద్య నేపథ్యం...
పరమశివుని జటాజూటం నుంచి ఉద్భవించిన ప్రళయకాల వీరభద్రుడు.. త్రినేత్రుడు భక్తులకు దర్శనమిచ్చాడు. అమ్మవారు స్వామి ఉగ్రరూపాన్ని అనునయిస్తూ దుర్గాదేవిగా ఆలయంలో అవతరించింది. ఉగ్రరూపంతో ఊగిపోతున్న ప్రళయ రుద్రుణ్ని శాంతించడానికి అప్పట్లో భక్తులు ఆలయ ప్రధాన ద్వారం వద్ద పంచాన్న భోజనాలతో మహా నైవేద్యం రాశి పోశారు. స్వామి తన మూడో కన్నుతో మహా నైవేద్యం స్వీకరించి శాంతించారు. అప్పటి నుంచి ఆనవాయితీగా.. బ్రహ్మోత్సవాల్లో మహా నైవేద్య ఘట్టం కొనసాగుతోంది.