Dalit Man Beaten To Death in AP: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో అగ్రవర్ణాలు.. దళితుడిపై దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సొంత జిల్లాలోని దళితులకు రక్షణ లేకుండా పోయిందంటూ దళిత సంఘాలు ఆరోపించాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలుపరచాలని డిమాండ్ చేశారు. దళితులకు ప్రాణ రక్షణ లేదంటూ.. ఆత్మరక్షణ కోసం తమకు కూడా ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పులివెందుల నియోజకవర్గంలోని అంకాలమ్మ గూడూరుకు చెందిన దళితుడైన కృష్ణయ్య అదే ప్రాంతానికి చెందిన గౌతమి, ఉత్తమ రెడ్డి, కమలమ్మలకు ఫిబ్రవరి 17వ తేదీన స్థానికంగా గొడవ జరిగింది. గొడవలో భాగంగా అగ్రవర్ణాలకు చెందిన ఉత్తమ రెడ్డి, గౌతమి, కమలమ్మలు.. కృష్ణయ్య నివాసానికి నిప్పు పెట్టారు. దీంతో వారు భయాందోళనకు గురై మూడు నెలలపాటు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. తిరిగి మే నెలలో సొంత గ్రామానికి వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. అప్పట్లో జరిగిన దాడిని మనసులో పెట్టుకొని గౌతమి, ఉత్తమారెడ్డి, కమలమ్మలు ఈనెల 13వ తేదీన కృష్ణయ్యతో మరోమారు గొడవకు దిగారు.. అతనిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో కృష్ణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు చికిత్స నిమిత్తం కృష్ణయ్యను కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణయ్య నేడు మృతి చెందాడు.
కృష్ణయ్యపై దాడి, మృతి విషయం తెలుసుకున్న ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపించారు. 41 నోటీసులు ఇచ్చి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని దండు వీరయ్య మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులకు ప్రాణాలకు రక్షణ లేదని, ఆత్మరక్షణ కోసం తమకు కూడా ఆయుధాలు ఇవ్వాలని వీరయ్య కోరారు. గతంలో అగ్రవర్ణాలైనా గౌతమి ఉతమారెడ్డి, కమలమ్మల మధ్య జరిగిన గొడవను మనుసులో పెట్టుకొని తన తండ్రిని వారే హత్య చేశారని, మృతుడి కొడుకు అరవింద్ ఆరోపించారు. నిందితులను అరెస్టు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
'గతంలో దళితులు, అగ్రవర్ణాల మధ్య జరిగిన గొడవలో దళితులపై దాడులు జరిగాయి. ఈ అంశంపై ఇరువర్గాలు కేసులు నమోదు చేశారు. అనంతరం దళితులు ఆ గ్రామంలో నుంచి మూడు నెలల పాటు వెళ్లారు. అనంతరం గ్రామంలోకి వచ్చిన వారిపై మళ్లీ అగ్రవర్ణాలకు చెందిన వారు దాడి చేశారు. దాడి ఘటనలో కృష్ణయ్య మృతి చెందాడు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే కృష్ణయ్య మృతి చెందాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. మృతి చెందిన కృష్ణయ్య కుటుంబానికి రూ.50 లక్షలు ఇవ్వాలి.'- దండు వీరయ్య మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు