JAGAN KADAPA TOUR : కృష్ణా జలాలను కడప జిల్లాకు తీసుకువచ్చిన ఘనత వైఎస్ఆర్దే అని ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. వైఎస్‌ఆర్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్.. కమలాపురంలో రూ.900 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వైఎస్ఆర్ హయాంలో చిత్రావతి డ్యామ్ నిర్మాణం జరిగిందని తెలిపారు. రూ.250 కోట్లతో చిత్రావతి డ్యామ్ ఆర్ అండ్ ఆర్ పనులు చేపట్టామన్నారు. వైఎస్ఆర్ హయాంలో గండికోట ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తైందని.. రూ.500 కోట్లతో ఆర్ అండ్ ఆర్ పనులు చేపట్టామన్నారు. గండికోట ప్రాజెక్టులో 10-15 టీఎంసీలు నింపలేని పరిస్థితి నుంచి.. 27 టీఎంసీలు నింపగలిగేలా చేశామన్నారు. రూ.500 కోట్లతో బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు తెలిపారు.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే మరో రాష్ట్రం అని.. దత్తపుత్రుడి మాదిరిగా ఈ భార్య కాకపోతే.. మరో భార్య అని నేను అనుకోవట్లేదని అన్నారు. ఇదే నా రాష్ట్రం.. నేను ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. మరో 18 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు. నేను ఎవరినీ నమ్ముకోలేదు.. ప్రజలు, దేవుడినే నమ్మానని అన్నారు. జనవరి నెలాఖరులో కడప స్టీల్ ప్లాంటు పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. విభజన చట్టంలో ఉన్నా.. గత పాలకులు పట్టించుకోలేదని.. జిందాల్ స్టీల్‌తో మాట్లాడి కడప ఉక్కు పరిశ్రమకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు.
పెద్ద దర్గాలో చాదర్ సమర్పించిన జగన్: అంతకుముందు సీఎం జగన్.. కడప పెద్ద దర్గాలో చాదర్ సమర్పించారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన పెద్ద దర్గాకి చేరుకున్న సీఎం జగన్‌కి.. దర్గా పీఠాధిపతి, ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో ప్రార్థనలు చేసి.. చాదర్ సమర్పించారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష, మేయర్ సురేష్‌బాబు, ఇతర నాయకులు ఉన్నారు.
ఇవీ చదవండి: