కరోనా వైరస్ తీసుకొచ్చిన కష్టాలు అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా దుకాణాలు మూతపడ్డాయి. కడప జిల్లాలో వస్త్ర వ్యాపార రంగంపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపింది. నగరంలో దాదాపు 40 ఏళ్ల నుంచి వైవీ స్ట్రీట్, బీకేఎం స్ట్రీట్లు వస్త్ర వ్యాపారానికి కేంద్రంగా ఉన్నాయి. ఎన్ని షాపింగ్ మాల్స్ వచ్చినా... వైవీస్ట్రీట్లో ఉన్న వస్త్ర వ్యాపారానికి గిరాకీ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ దాదాపు 2 వేల వరకు వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఎప్పుడూ చూసినా జనంతో కళకళలాడుతూ ఉండేవి.
2 నెలల్లో 200 కోట్లు నష్టం
వీటితోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలు హోల్ సేల్ వ్యాపారానికి ప్రసిద్ధి. ఇక్కడ నెలకు సుమారు 100 కోట్ల పైగా వ్యాపారం జరిగేది. ఈ లెక్కన 2 నెలలకు జిల్లాలో వస్త్ర వ్యాపార రంగం 200 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయినట్లయింది. ఇక్కడి వ్యాపారులంతా సూరత్, అహ్మదాబాద్, ముంబాయి, కోల్‌కతా, నాగపూర్, జబల్ పూర్, కాన్పూర్, దిల్లీ నుంచి వస్త్రాలను హోల్ సేల్‌గా కొనుగోలు చేసి జిల్లాలో విక్రయిస్తుంటారు. లాక్ డౌన్‌కు ముందే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన సరకు కోట్లలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి 5 శాతం జీఎస్టీ చెల్లించి తెచ్చిన వస్త్రాలు... దుకాణాల్లో మూలుగుతున్నాయి. ఇప్పుడు షాపులు తెరిచే నాటికి ఎన్ని పాడైపోయి ఉంటాయో అని వ్యాపారస్థులు ఆందోళన చెందుతున్నారు.
పూటగడవని స్థితిలో గుమస్తాలు
యజమానుల కష్టాలు అలా ఉంటే.. గుమస్తాల బాధలు మరో రకంగా ఉన్నాయి. పనిలేక, ఉపాధి లేక పూట గడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇద్దరు గుమస్తాలు ఆకలితో చనిపోయారని.. మరొకరు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. లాక్ డౌన్ కాలంలో జీఎస్టీ రద్దు చేయటంతో పాటు.. చిన్న వ్యాపారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ అద్దెలు భారీగా ఉంటాయి. దుకాణాలు తెరవకపోవడం వలన వచ్చే నష్టం ఒకవైపైతే.. 3 నెలలు అద్దెలు చెల్లించడం వారికి మరింత భారంగా మారింది.
జిల్లా వ్యాప్తంగా వస్త్ర వ్యాపార రంగంపై ఆధారపడి దాదాపు 50 వేల మంది జీవిస్తున్నారు. చిన్న దుకాణాలు, హోల్ సేల్ షాపుల్లో పనిచేసే గుమాస్తాలు 10 వేలకు పైగానే ఉన్నారు. వారికి రోజు కూలీ చొప్పున ఇస్తుంటారు. 70 రోజులుగా పని లేక గుమాస్తాల కుటుంబాలు పస్తులుంటున్నాయి. ఇంటి అద్దెలు చెల్లించలేక.. చిట్టీలకు డబ్బులు కట్టలేక... చేసిన చిన్నచిన్న అప్పులు తీర్చలేక నానా బాధలు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈనెల 4 నుంచి వస్త్ర దుకాణాలు తెరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచన ప్రాయంగా చెప్పడం కొంతవరకు ఊరటనిచ్చే అంశంగా వ్యాపారస్థులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి.... మరో ఏడాది చూస్తా.. తర్వాత నిలదీస్తా: ఆనం