ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలుషితం చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కడప జిల్లా రాయచోటిలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన... ఎస్ఈసీ, తెదేపాల తీరుపై మండిపడ్డారు. నిమ్మగడ్డ ఎన్నికల అధికారా? లేక తేదేపా ప్రతినిధా? అంటూ ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాల కోసం నిమ్మగడ్డ రహస్యంగా ఎన్నికల యాప్, షాడో కమిటీలు తెస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలను కలుషితం చేయడం దారుణమన్నారు.
నిమ్మగడ్డ చేస్తున్న తప్పులకు.. భవిష్యత్తులో పశ్చాత్తాప పడే రోజు వస్తుందని ఆయన అన్నారు. వ్యవస్థలను తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట అని, రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే తేదేపా ప్రతినిధిగా పని చేస్తున్నట్లు అర్థమవుతోందని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మహానేత వైఎస్ఆర్ మరణించిన 12 ఏళ్ల తర్వాత కూడా ఆయన పేరును ప్రస్తావించడాన్ని చూస్తే ఆయనపై అభిమానం కంటే ఓ పార్టీకి మద్దతు పలికే రీతిలో ఉండడంతో పాటు మరో పార్టీని రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలా మాట్లాడడం సమంజసమా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: లక్ష్మణ రేఖ దాటింది మేం కాదు.. నిమ్మగడ్డే: మంత్రి బొత్స