కడప జిల్లా బద్వేల్ శాసనసభ్యుడు డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతిచెందారు. కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 6:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు ఎంబీబీఎస్ చేస్తుండగా... మరొకరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్‌గా వెంకటసుబ్బయ్య కొంత కాలం సేవలందించారు.
వైకాపా నుంచి 2019లో తొలిసారిగా బద్వేల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వు అయిన కారణంగా.. మంచి సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ వెంకట సుబ్బయ్యకు వైకాపా అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కేటాయించింది. రెండేళ్ల నుంచి ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. 3 నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స సైతం తీసుకున్నారు.
పది రోజుల కిందటే హైదరాబాద్ నుంచి ఆయన కడపకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనను ఫోన్లో పరామర్శించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే నిన్న తీవ్ర అస్వస్థతకు గురికాగా ... కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు కుటంబసభ్యులు. చికిత్స పొందుతూ ఈ ఉదయం వెంకటసుబ్బయ్య కన్నుమూశారు. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఆయన మృతదేహాన్ని బద్వేల్‌కు తీసుకెళ్లనున్నారు. అక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచుతారు. అక్కడినుంచి కడపకు తీసుకొచ్చి సొంత పొలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన సోదరుడు సుబ్బారావు తెలిపారు.
హాజరుకానున్న సీఎం..
ముఖ్యమంత్రి జగన్ మధ్యాహ్నం 3 గంటలకు కడప వెళ్లనున్నారు. అనారోగ్యంతో మృతిచెందిన.. బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా.. కడప కోఆపరేటివ్ సొసైటీ కాలనీలో ఉంటున్న వెంకటసుబ్బయ్య నివాసానికి సీఎం వెళ్లనున్నారు. పరామర్శ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.
ఇదీ చూడండి: