కడప జిల్లా కొండాపురం సమీపంలో ఉన్న గండికోట ప్రాజెక్టులో ఈ ఏడాది 26 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. ఆ మేరకు జల వనరుల శాఖ అధికారులతో పలుమార్లు సమీక్షలు చేసిన సీఎం... అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది జులై 8న జమ్మలమడుగులో హామీ ఇచ్చిన మేరకు ఈసారి కచ్చితంగా 26 టీఎంసీలు గండికోటలో నిల్వ చేయాలని భావిస్తున్నారు.
26 టీఎంసీలు నిల్వ చేయాలంటే కొన్ని ముంపు గ్రామాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. వారికి పునరావాసం, పరిహారం ఇవ్వాలంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు అవుతోంది. ముందుగా బాధితులకు పరిహారం ఇచ్చేందుకు రూ.522 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు ముంపు గ్రామాల ప్రజలకు ఈ పరిహారం ఇచ్చే విధంగా జలవనరులశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గండికోట ముంపు గ్రామాలైన తాళ్ల ప్రొద్దుటూరు, చామలూరు, రేగడిపల్లి, సుగుమంచిపల్లి, ఎర్రగుడి, పి.అనంతపురం, ఏటూరు ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ.3 లక్షల 25 వేలు పరిహారంగా ఇవ్వనున్నారు. 26 టీఎంసీలు నిల్వ చేయాలంటే ఏడు గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న కారణంగా వారిని ఖాళీ చేయించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
ఇదీ చదవండి: 'ఆప్కో' అవినీతిపై సీఐడీ విచారణ వేగవంతం