Vontimitta Kodandarama Swamy Kalyanam 2023 : పండు వెన్నెల్లో కన్నుల పండువగా సాగే శ్రీ కోదండరాముడి కల్యాణ మహోత్సవానికి ఒంటిమిట్ట ముస్తాబైంది. శాశ్వత కల్యాణ వేదికలో లక్ష మంది భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. సీఎం జగన్ పర్యటన రద్దు కావడంతో.. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి లేదా టీటీడీ ఛైర్మన్.. స్వామి వారికి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు.
వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి నిర్వహించే సీతారాముల కల్యాణానికి టీటీడీ సర్వం సిద్ధం చేసింది. 52 ఎకరాల విస్తీర్ణంలోని శాశ్వత కల్యాణ వేదికలో దాదాపు లక్షమంది భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్యాణం వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు వేద పండితులు రాజేశ్ కుమార్ భట్టార్ సమక్షంలో కల్యాణ క్రతువును వైభవంగా నిర్వహించనున్నారు.
"నూతనంగా నిర్మించిన సీతారాములు కల్యాణ వేదిక వద్ద రాత్రి 8 గంటలకు స్వామి కల్యాణం జరుగుంది. ఏటా ప్రభుత్వ లాంఛానాలతో కల్యాణం జరిపిస్తాము. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం నిర్వహించినట్లుగానే రాత్రి సమయంలో కల్యాణం నిర్వహిస్తాము. ఇక్కడి కల్యాణానికి ప్రత్యేకత ఉంది." -రాజేశ్ కుమార్ భట్టార్, టీటీడీ ఆగమ సలహాదారు
పురాణాల ప్రకారం చతుర్దశి, పున్నమి రోజు చంద్రుడు వీక్షించేలా శ్రీరాముడు రాత్రి సమయంలో కల్యాణం చేసుకుంటారని వేద పండితులు చెబుతున్నారు. సాయంత్రం కాంతకోరిక పేరుతో కార్యక్రమం నిర్వహించే పండితులు.. ఎదుర్కోలు ఉత్సవంలో భాగంగా సీతారాముల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరిస్తారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపు నిర్వహిస్తారు. 11 వ శతాబ్దం నుంచి ఇక్కడ కోదండరాముడికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
"ఆలయంలోని సీతారాములు, లక్ష్మణుడి విగ్రహాలు ఒకే శిలతో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ప్రాంతం ఒకే మిట్టలాగా ఉండటంతో ఒంటిమిట్ట అని పేరు. ఈ ఆలయం 11వ శతాబ్దంలోనే నిర్మితం అయ్యింది."-శ్రవణ్‌కుమార్, అర్చకులు ఒంటిమిట్ట దేవాలయం
సీఎం జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు కావడంతో.. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ లేదా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమర్పించనున్నారు. బయట నుంచి కల్యాణం వీక్షించే భక్తజనం కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు గ్యాలరీలోనే ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాలు అందజేయనున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఒంటిమిట్టకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 100 బస్సులను నడపనుంది.
ఇవీ చదవండి :