రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం ఏటికేడు పెరుగుతోంది. మామిడి, కోకో, జామ, కొబ్బరి, అయిల్ ఫామ్, జీడిమామిడి వంటి పంటలు లక్షల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. ఈ పండ్ల తోటల చెట్లు దాదాపు పది నుంచి ఇరవై మీటర్ల ఎత్తుకు పెరుగుతాయి. చెట్ల చివరి భాగంలో చీడపీడలు, తెగుళ్లు, పురుగులు ఉండటాన్ని రైతులు గమనించలేకపోతున్నారు. తీరా చూసుకున్న సరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో గమనించిన పశ్చిమగోదావరి జిల్లా ఏలురూ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులు 'డ్రోన్ అగ్రి డాక్టర్' పరికరాన్ని ఆవిష్కరించారు.
వీడియోలు, ఫోటోల ఆధారంగా గుర్తింపు..
ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న భరద్వాజ, త్రివేణి, వీరబాబు, కృష్ణవంశీలు జట్టుగా ఏర్పడి చీడపీడల నివారణ కోసం ఈ పరికరాన్ని రూపొందించారు. తెగుళ్ల సమస్యపై దృష్టిసారించిన వీరు... క్షేత్రస్థాయిలో రైతులను కలిశారు. చీడపీడలను గుర్తించే పరికరం రూపొందించడానికి కార్యచరణ చేపట్టారు. ఇందుకోసం డ్రోన్లను వినియోగించారు. పండ్ల తోటల పైభాగానికి డ్రోన్ పంపించి... అది తీసే వీడియో, ఫోటోల ఆధారంగా చీడపీడలు గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ విధానం ద్వారా క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు రాబట్టామని అధ్యాపకులు అంటున్నారు.
ఏ రకమో గుర్తిస్తోంది...!
ఉద్యాన పంటల్లో డ్రోన్ ఎగరేసి.. ఆయా చెట్లను పరిశీలిస్తారు. చరవాణిలో రైతులే దీన్ని ఆపరేటింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. పోలంలో డ్రోన్ తిరుగుతున్న సమయంలో అనుమానం వస్తే... ఫోటో తీయవచ్చు. ఫోటో ఆధారంగా ఏ రకం తెగులు అన్నది గుర్తించే వీలు ఉంటుంది. డ్రోన్‌కు సంబంధించిన యాప్‌ను రైతులు.. తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్లో దాదాపు 28 రకాల పండ్లతోటలకు సంబంధించిన 200 తెగుళ్ల ఫోటోలు ఉంచారు. డ్రోన్ ఫోటో తీసిన వెంటనే యాప్లో ఉన్న ఫోటోతో సరిపోల్చుకొని.. ఏ తెగులు అన్నది నిర్ధారిస్తుంది.
రైతులు సత్వరం అధికారులు, శాస్త్రవేత్తల సూచన మేరకు మందులు పిచికారి చేసుకొని చీడపీడలను అదుపు చేసుకోవచ్చు. ఉద్యానవన రంగంలో వచ్చే ఈ తరహా నష్టాలను నివారించేలా విద్యార్థులు యంత్రం కనుగొనటం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : "విజయసాయి వ్యాఖ్యల అర్థం అది కాదు.. ఇదే"