పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరులను తలుచుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా
ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండులోని పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద మంత్రి ఆళ్ల నాని... జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు... జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ అమర వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ... పోలీసుల కష్టాలను గుర్తుపెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వారంతపు సెలవులు మంజూరుకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో పోలీసులు.. విద్యార్థులు కలిసి ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి బోసు బొమ్మ కూడలి వరకు ర్యాలీ చేశారు. అనంతరం మానవహారం చేపట్టి అమర వీరులకు నివాళులు అర్పించారు.
విజయనగరం
అమరవీరుల దినోత్సవం సందర్భంగా చీపురుపల్లి.. గరివిడి పోలీసులు జడ్పీ బాయ్స్ హై స్కూల్ విద్యార్థిని.. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక గాంధీ మహాత్ముని విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి పోలీసు అమరవీరుల దినోత్సవ నినాదాలు చేశారు.
కడప
పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్మలమడుగులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 70 మంది యువకులు ముందుకు వచ్చి రక్త దానం చేశారు. ఈ సందర్భంగా అమరులైన పోలీస్ సేవలను అధికారులు కొనియాడారు.
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాజంపేటలో పోలీసులు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి డీఎస్పీ మాట్లాడుతూ... చినుకు పడితే తల తడవకుండా దాచుకునేందుకు మనం పరుగులు తీస్తామని... అదే దేశ సరిహద్దుల్లో తుపాకీ గుండ్ల వర్షం పడుతున్నా ప్రాణాలను లెక్కచేయకుండా పోలీసులు పోరాడుతున్నారని తెలిపారు. అలాంటి వీరుల త్యాగాలను స్మరించుకుంటూ... దేశంలో శాంతి.. అహింస కోసం యువత పాటుపడాలని సూచించారు.
నెల్లూరు జిల్లా
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా.. ఉదయగిరి సర్కిల్ పరిధిలోని పోలీసులందరూ విద్యార్థులతో కలసి ర్యాలీ నిర్వహించారు. ప్రజల సంరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న పోలీసులకు ప్రజలు తమ వంతు సహకరించి వారికి మరింత ధైర్యాన్ని ఇచ్చి ఉత్సాహ పరచాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
చిత్తూరు జిల్లా
వారం రోజులుగా అమర వీరులను సంస్మరించుకుంటూ పలు కార్యక్రమాలను చేపట్టిన టాస్క్ ఫోర్స్ తమ కార్యాలయ ప్రాంగణంలో అమరవీరుల స్థూపానికి ఘనంగా అంజలి ఘటించారు. అనంతరం టాస్క్ ఫోర్స్ ఇంఛార్జ్ రవిశంకర్ మాట్లాడుతూ... అమర వీరుల ప్రాణాల త్యాగ ఫలితంగా దేశం ప్రశాంతంగా ఉందని అన్నారు. 1959 లో లఢక్ లో జరిగిన చైనా దాడుల్లో పది మంది సీఆర్పిఎఫ్ జవానులు వీరమరణం పొందారని.... వారిని స్మరించుకునేందుకు 1960 నుంచి ఏటా అక్టోబర్ 21న అమర వీరులను సంస్మరణ చేసుకుంటున్నామని అన్నారు. ఈ సంవత్సరం 292 మంది వీర మరణం పొందారని... అందులో ఇద్దరు రాష్టానికి చెందినవారు ఉన్నారని తెలిపారు.
కృష్ణా జిల్లా
మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రవాణాశాఖ మంత్రి పేర్ని నాని.. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు.. కైకలూరు ఎమ్మెల్యే దూళం నాగేశ్వరరావు.. శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు... జిల్లా పోలీసు అధికారులు తదితరులు పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు.
ప్రకాశం జిల్లా
పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా దర్శి సర్కిల్ పరిధిలోని సిబ్బంది ర్యాలీ చేపట్టారు. పోలీసు అమరవీరులారా అందుకోండి మా జోహారులు.. మీ త్యాగాలు మరువలేనివి. అమరవీరులారా అడుగడునా మీకు మా దండాలు అంటూ దర్శి పట్టణంలోని ప్రధాన వీదులలో నినాదాలు చేశారు. అనంతరం ఎస్పీడీఓ కార్యలయంలో విద్యార్ధిని, విద్యార్ధులకు జిల్లా ఎస్పీతో ముఖాముఖీ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా చీరాలలో విద్యార్థులు.. సబ్ డివిజన్ లోని పోలీసులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం కూడలిలో మానవహారం నిర్వహించి విధినిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు.
అనంతపురం జిల్లా
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఉరవకొండ పట్టణంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శివప్రసాద్ స్థానిక మదర్సా ముస్లీం అనాధ పిల్లలకు... ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
ఇదీ చూడండి: పోలీసు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తాం: సీఎం జగన్