కడప జిల్లా
కడప జిల్లా జమ్మలమడుగులోని తెదేపా నాయకులు, గిరిధర్‌రెడ్డి, లింగారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక ర్యాలీ నిర్వహించారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకొని... ఉచిత ఇసుక విధానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాజంపేట గాంధీ విగ్రహం వద్ద తెదేపా నాయకులు ఇసుక సమస్యలపై నిరసన చేపట్టారు. ఇసుకను కిలోల చొప్పున విక్రయించి నిరసన తెలిపారు. రాజంపేట నుంచి బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు అక్రమంగా ఇసుక తరలిపోతోందని ఆరోపించారు.
కృష్ణా జిల్లా
ఇసుక విషయంలో ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కలక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. శాసన మండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు... మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ మాజీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు తదితరులు కార్యక్రంలో పాల్గొన్నారు. లోపభూయిష్టంగా ఉన్న నూతన ఇసుక విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తీరు మార్చుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తూర్పు గోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతపై ఆందోళన నిర్వహించారు. ఇసుకను కాటాతో కొలుస్తూ కేజీ రూ.100 కు విక్రయిస్తూ నిరసన తెలిపారు. అనంతరం రావాలి ఇసుక కావాలి ఇసుక అంటూ ప్రధాన రహదారి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ బండారు సూర్యనారాయణకు వినతిపత్రం అందించి సమస్యలు వివరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా
ఇసుక సరఫరాపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట తెదేపా ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు... ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు... తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా
ఇసుక కొరతను నిరసిస్తూ గురజాల ఆర్డీఓ కార్యాలయం వద్ద తెదేపా నేతలు నిర్వహించే ధర్నాకు వెళ్తున్న మాచవరం మండల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్థానిక బస్టాండ్ కూడలిలో పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. ఇసుక కొరత అధిగమించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా వైఫలమైందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ గురజాలలో నిరసన కార్యక్రమం చేపడితే దాన్ని అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇసుక కొరత నివారించాలని డిమాండ్ చేశారు.
అనంతపురం జిల్లా
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఇసుకను స్మగ్లింగ్ చేస్తూ పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట పలువురు నాయకులు.. కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ... ఇసుక విధానంలో తీవ్ర గందరగోళం సృష్టిస్తూ భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి శ్రీశైలానికి పర్మిట్లు తీసుకుని బెంగళూరుకు ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు.
కర్నూలు జిల్లా
ఇసుక కొరతపై తెదేపా నాయకులు నందికొట్కూరులో ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరును కేంద్రంగా ఏర్పాటు చేసి ఇసుక కొరత తీర్చి భవన నిర్మాణ కార్మికులకు పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమానికి కర్నూలు ట్రాక్టర్ ఓనర్స్ అసోషియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా
రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక కొరత పరిష్కరించి ప్రజలకు ఇసుక దొరికే విధంగా ప్రభుత్వం పాలసీని తీసుకురావాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. మదనపల్లె పట్టణం చిత్తూరు బస్టాండ్ కూడలిలో ఇసుక కొరతపై పార్టీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.
విశాఖపట్నం జిల్లా
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు వీధిన పడాల్సి వచ్చిందని తెదేపా నాయకులు పేర్కొన్నారు. ఇసుక కొరత నిరసిస్తూ విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. నెహ్రూ చౌక్ వద్ద నిరసన దీక్ష చేపట్టిన అనంతరం వంటావార్పు నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ప్రకాశం జిల్లా
ఇసుక కొరతపై ఒంగోలులో తెదేపా నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకూ కార్యకర్తలు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి ఇసుకపై సరైన విధానాల్లేవని ఆరోపించారు. ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయారని, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు.
ఇదీ చూడండి: 'ప్రభుత్వ తీరుతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు'