కష్టాలు ఎదురైనప్పుడు ముందు రెండు దారులు ఉంటాయి. ఒకటి కుంగిపోవడం. రెండోది..విధికి ఎదురునిలిచి పోరాడటం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన తిరునగరి అనసూయ ఆ రెండో పనే చేసింది. పంక్చర్లు వేసుకుంటూ జీవనం సాగించే ఆమె భర్త సత్యనారాయణ... కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు.. గృహిణి అయిన అనసూయకు పెద్దగా చదువు లేదు. జీవనోపాధికి వేరే పనులూ రావు. భర్త బతికున్న సమయంలో ఆయనకు పంక్చర్లు వేయడంలో సాయపడేది అనసూయ. ఆమె చొరవ చూసి పంక్చర్లు ఎలా వేయాలో భర్త సత్యనారాయణ నేర్పాడు. పెనిమిటి మరణం తర్వాత... అయ్యో అంటూ అంతా జాలిచూపే వారే కానీ.. ఆపదలో ఆదుకునేవారే కనిపించలేదు అనసూయకు.. ఆ ఆపత్కాలంలో భర్త నేర్పిన విద్యే ఆమెకు అన్నం పెట్టింది. పంక్చర్లు వేయడాన్నే అనసూయ తన జీవనోపాధిగా మార్చుకుంది.
సాధారణంగా పంక్చర్లు వేసే వృత్తిలో మహిళలు కనిపించరు. కానీ.. చదువుకుంటున్న ఇద్దరు ఆడపిల్లలు.. కుటుంబ భారం.. ఆమెను ధైర్యంగా ముందడుగు వేయించాయి. మొదట్లో కాస్త కష్టం అనిపించినా.. ఆ తరవాత అనసూయ పంక్చర్లు వేయడంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ ఆదాయంతోనే కుమార్తెలను బాగా చదివిస్తోంది. పంక్చర్ షాప్ అనసూయలా తలెత్తుకు బతకాలిరా అన్న పేరు తెచ్చుకుంది.
'పంక్చర్లు వేయడం మగవాళ్ల పని..నీ వల్ల కాదు.' అన్న మాటలను మొదట్లో అనసూయ లెక్క చేయలేదు. లారీ, కారు, ఆటో, బైక్.. ఏ టైర్ పంక్చర్ అయినా సరే.. చకచకా వేస్తుందామె. మొదట్లో కొంచెం కష్టం అనిపించినా ఆడ పిల్లల భవిష్యత్తు ఆమె కళ్ళ ముందు కదలాడటంతో ఆ కష్టాన్ని మరిచి పోయింది. క్రమంగా అనసూయ కుటుంబం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి.
కష్టం వస్తే కుంగిపోకూడదని..మహిళలు ఎందులోనూ తీసిపోరని ఈ సమాజానికి ధైర్యంగా చెబుతోంది పంక్చర్ షాప్ అనసూయ.
ఇదీ చదవండి
Viveka Case: శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు