ఆస్తి కోసం ఓ అల్లుడు అత్తనే చంపాడు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నవంబర్ 30వ తేదీన ఈ హత్య జరగగా.. పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. పట్టణంలో రఫీ ఉన్నీసా బేగం అనే మహిళకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. ఉస్మాన్ బాషాకు కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించింది. పది నెలల కిందటే రఫీ ఉన్నీసా బేగం భర్త మృతి చెందాడు. ఆ పట్టణంలోనే కుమారులతో కలిసి అద్దె ఇంట్లో జీవిస్తోంది. ఉన్నట్టుండి ఆమె అకస్మాత్తుగా మరణించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో అసలు విషయాలు తెలిసేసరికి అంతా ఆశ్చర్యపోయారు. అల్లుడే అత్తను చంపాడని పోలీసులు తెలిపారు. మృతురాలి హత్య వివరాలను సీఐ రఘు మీడియాకు వివరించారు. పొలం అమ్మి తాడేపల్లిగూడెంలో ఇల్లు కడదామని అల్లుడు ఎన్నిసార్లు అడిగినా.. ఆమె ఒప్పుకోలేదు. అందుకే ఆమెను చంపాలనుకున్నాడు. ఆమెకున్న ఆస్తులు ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో పథకం వేశాడు.
గత నెల 30న మధ్యాహ్నం రఫీ ఉన్నీసా బేగంను అల్లుడు, చిన్నకుమారుడు వెంకటరామన్నగూడెం సమీపంలోని ఓ నాటు వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం.. కారు ముందు సీట్లో కూర్చున్న రఫీ ఉన్నీసా బేగం మెడకు గుడ్డ చుట్టి... స్క్రూ డ్రైవర్‌తో మెడపై, శరీరంలోని ఇతర భాగాలపై విచక్షణారహితంగా పొడిచాడు. చనిపోలేదని మళ్లీ.. గొంతుకు చీరకొంగును బిగించి చంపాడు.
రాత్రి 11 గంటల వరకు కారులోనే తిరిగి మృతురాలి రక్తపు మరకలు అంటిన చీర మార్చేసి... ఆమెకు నైటీ తొడిగి ఇంట్లో శవాన్ని పడేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం పెద్ద కుమారుడు వచ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు చేయబోగా.. అల్లుడు అడ్డుతగిలాడు. శవాన్ని పంచనామా చేసి నాలుగు రోజులు ఇవ్వరని చెప్పి.. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్దామని చెప్పాడు. మార్గం మధ్యలో చిన్న కుమారుడిని కారులో ఎక్కించుకుని దహన సంస్కారాలు చేసేందుకు యత్నించాడు.
విషయం తెలుసుకున్న వీఆర్వో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు నిందితుడిని పట్టుకుని హత్యకు వాడిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి. లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి.. నలుగురి పరిస్థితి విషమం