Lorry Driver Murder Case: పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుంచి కోల్కతా వెళుతున్న కోడిగుడ్ల లారీని లూటీ చేసి, డ్రైవర్ని హత్య చేసిన ఘటనలో ముగ్గురు నిందితుల్ని తణుకు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ఘటన జరిగి ఎనిమిదిన్నర నెల తర్వాత నిందితులు పోలీసు చేతికి చిక్కినట్లు ఎస్సీ రవి ప్రకాష్ వెల్లడించారు. హత్యకు గల కారణాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు.
కోడిగుడ్ల లారీని లూటీ చేయడం కోసం హత్య: ఎస్పీ రవి ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం... తణుకు మండలం తేతలి గ్రామానికి చెందిన కడలి వెంకటేశ్వరరావు లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడని ఎస్పీ వెల్లడించారు. గత ఆగస్టు 12వ తేదీన వెంకటేశ్వర ట్రేడర్స్ ద్వారా తణుకు నుంచి కోల్కతా కోడిగుడ్ల లోడు తీసుకుని వెళ్లాడని పేర్కొన్నాడు. కోడిగుడ్ల లారీని లూటీ చేయడానికి పది మంది నిందితులు పన్నాగం పన్నారని... ఇందులో భాగంగా ఇద్దరు నిందితులు విశాఖపట్నం సమీపంలో వెంకటేశ్వరరావు లారీ ఎక్కారని ఎస్పీ తెలిపారు. ఆ తరువాత లారీలోనే కొంత దూరం ప్రయాణించి, అదును చూసుకొని అనకాపల్లి సమీపంలో జాతీయ రహదారి వద్ద లారీ డ్రైవర్ వెంకటేశ్వరరావును కత్తితో పొడిచి హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అనంతరం సాక్ష్యాధారాలు లేకుండా డ్రైవర్ శవాన్ని అనకాపల్లి సమీపంలో శారదా నది అనుబంధ ఏలేరు కాలువలో పడేసినట్లు నిందితులు అంగీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు. అనంతరం లారీలోని కోడిగుడ్లను నిందితుల్లో ఒకరి ఇంటి వద్ద దాచి పెట్టినట్లు తెలిపారు. అనుకూలమైన సమయం చూసి.. ఆ లారీని తీసుకెళ్లి ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా టోల్గేట్ సమీపంలో వదిలివేశారని ఎస్పీ పేర్కొన్నారు. కొద్ది రోజుల తర్వాత కోడిగుడ్లను అమ్ముకుని నిందితులు సొమ్మును పంచుకున్నట్లు ఎస్పీ రవి ప్రకాష్ తెలిపారు.
అప్పట్లో కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు నిందితుల కోసం నిఘా పెట్టారు. తణుకు పాత టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా తిరుగుతున్న విశాఖపట్నం జిల్లా భీముని పట్నం మండలం తగరపువలస గ్రామానికి చెందిన చందక రమేష్, విశాఖపట్నం రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన తంగేటి బుల్లయ్య, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వోని గ్రామానికి చెందిన నిమ్మక సింహాచలం వారిని అదుపులోనికి తీసుకుని విచారించారు. విచారణలో అనకాపల్లి వద్ద జరిగిన హత్య ఘటన వెలుగులోనికి వచ్చింది. ఘటనపై పూర్వపరాలను మరింతగా విచారించి త్వరలోనే విరిని కోర్టులో ప్రవేశపెడతాం. -రవి ప్రకాష్ జిల్లా ఎస్పీ
ఇవీ చదవండి: