Paddy Farmers Problems in West Godavari District: వర్షాలు తగ్గినా వరుణుడి దెబ్బ నుంచి రైతులు ఇంకా కోలుకోలేదు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. అన్నదాతలకు అండగా ఉండాల్సిన ఆర్బీకేలు అక్కరకు రావడం లేదు. ధాన్యం నిల్వలు కల్లాల్లో ఉండగానే ఇంకా కోత కోయాల్సిన పంట పరిస్థితి ఏంటనే ఆలోచన రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పొలాల్లో నీరు చేరి బురదగా మారడంతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. అన్నివైపుల నుంచి కష్టాలు చుట్టుముట్టడంతో అన్నదాత అల్లాడిపోతున్నాడు.
తేమ శాతం.. ధరల్లో భారీ కోత : వర్షాలు తగ్గుముఖం పట్టి ఎండలు కాస్తుండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మిగిలిన వరి కోతలు ముమ్మరం చేశారు. పొలాల్లో నీరు చేరి బురదగా మారడంతో కోత వేగంగా సాగడం లేదు. సాధారణ సమయం కంటే మరో 2 గంటలు అదనంగా పడుతుండటం రైతులకు భారంగా మారింది. కోనసీమ జిల్లా మండపేట, రామచంద్రపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గాల్లో వరి ఇంకా కోయాల్సి ఉంది. రబీ సీజన్‌లో 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా వేయగా ఇప్పటి వరకు సుమారు 82 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. తడిచిన ప్రతీ గింజను కొంటామని ప్రభుత్వం చెప్పినా ప్రయోజనం కనిపించడం లేదు. ఆర్బీకేల వల్ల కూడా రైతులకు మేలు జరగట్లేదు. తేమ శాతం పేరిట ధరల్లో భారీ కోత విధిస్తున్నారు. పనిలో పనిగా మిల్లర్లు దోచుకుంటున్నారు.
కౌలు రైతుల ఆవేదన : కౌలు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లక్షల్లో అప్పులు చేసి మరీ పంటలు పండిస్తే వచ్చేది మాత్రం శూన్యం. ఏ ఆర్నెల్లకో ప్రభుత్వమిచ్చే పరిహారం కూడా భూయజమానికి వస్తుంది తప్ప కౌలుదారులకు అందడం లేదు. కౌలు రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్న సర్కారు వారి మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. కౌలు కార్డుల ఊసే ఎత్తడం లేదు. పెట్టుబడులు కూడా రావని వ్యవసాయం చేయడమే కష్టంగా ఉందని కౌలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాట మార్చేసిన అధికారులు : బొండాల రకం పండించిన రైతులదీ అదే దుస్థితి. బొండాలు రకం వేయమని చెప్పిన అధికారులు ఇప్పుడు మాట మార్చేశారు. ఆ రకం ధాన్యం కొనలేమని తెగేసి చెప్పారని రైతులు వాపోతున్నారు. దళారులు కూడా తక్కువ ధరకే అడుగుతుండటంతో పొలంగట్లు, కల్లాల్లోనే వడ్లు ఉంచేశారు. అన్నిరకాల ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి త్వరగా ఖాతాల్లో డబ్బులు వేయాలని రైతులు వేడుకుంటున్నారు.
"నాలుగు ఎకరాల వరి వేశాను. కోతకు వచ్చే సమయంలో వర్షాలు పడటం వల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. కోయడానికి కూడా పోలాలల్లో నీరు ఉండిపోయింది. దానికి తోడు గిట్టుబాటు కూడా లేదు."- రైతు
"ధాన్యం తడిసిపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మిల్లు దగ్గరుకు తీసుకపోతేనేమో 3,4 కేజీలు కటింగ్ చేస్తున్నారు. ఎకరాకు 40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఈ విధంగా నష్టాలు వస్తే వ్యవసాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రారు. ప్రభుత్వమే మమల్ని ఆదుకోవాలి."- రైతు
ఇవీ చదవండి