Janasena chief Pawan Kalyan: ప్రజలు ఎంతో కష్టపడి పన్నులు కడితే వాటిని కొందరు నేతలు దోపిడీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. నేతలు అవినీతి, దోపిడీయే లక్ష్యంగా పరిపాలిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు. వైసీపీ ప్రభుత్వం, సీఎం, మంత్రులపై తనకు వ్యక్తిగత ద్వేషం లేదన్న పవన్ కల్యాణ్.. సీఎం, మంత్రులు.. రాష్ట్రంలోని వనరులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రోజులు మారాయన్న పవన్ .. మాటలతో మోసం చేయలేమని సీఎం జగన్ గ్రహించాలని హితబోధ చేశారు.
అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్: విద్య, వైద్యం కొద్దిమంది చేతుల్లో ఉండకూడదని పవన్ పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జనసేన మార్పుకోసం వచ్చిందని.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే పరిస్థితి లేదని పవన్ స్పష్టం చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూసే బాధ్యతను తాను తీసుకుంటానని పునరుద్ఘాటించారు. మార్పుకోసం వచ్చిన మనం మధ్యలో వెనకడుగు వేయకూడదని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు పవన్ వెల్లడించారు. విద్య, వైద్య వ్యవస్థలు కొంతమంది చేతుల్లో ఉంటే ఎలా? అంటూ పవన్ ప్రశ్నించారు. గోదావరి జిల్లాల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.
'కనీస వసతులు అందరికీ అందాలి.. అది ప్రాథమిక హక్కు. ప్రాథమిక సౌకర్యాలు లేకుంటే ప్రజలు ఉద్యమం చేస్తారు. ఎవరో ఒకరు మొదలుపెట్టకపోతే సమాజంలో మార్పు రాదు. అన్యాయంపై తిరగబడాలని మనకు బడుల్లో నేర్పించారు. అంతా కలిసి గట్టుగా అన్యాయంపై పోరాడాలి. స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతల స్ఫూర్తితో పాలన జరగాలి. అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నాం అంటాడు.. కానీ రాజ్యాంగాన్ని గౌరవించరు.'- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
రైతులకు మద్దతు ధర: గోదావరి జిల్లాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న పవన్.. ఆరుగాలం కష్టపడి పనిచేసిన రైతులకు మద్దతు ధర రాలేదని పేర్కొన్నారు. ఎలాంటి పని చేయని వారు రైతులను దోచుకుని బాగు పడుతున్నారని విమర్శించారు. అభివృద్ది జరగాలంటే, అరాచకం పోవాలంటే జగన్ను గద్దె దింపాలని పిలుపునిచ్చారు. జనం బాగుండాలంటే జగన్ పోవాలని వెల్లడించారు. రిజర్వేషన్ల పేరుతో మోసం చేసిన వైసీపీ పోవాలన్న పవన్.. హలో ఏపీ.... బై బై వైసీపీ అంటూ ప్రసంగం ముగించారు.