పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, పురపాలక సంఘాలతో పాటు చింతలపూడి, ఆకివీడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వార్డుల విభజన, గ్రామాల విలీన ప్రక్రియపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానాల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏ నిమిషంలో అయినా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు అధికారులు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
తణుకు పురపాలక సంఘంలో వార్డుల సంఖ్య 32 నుంచి 34కు పెరిగాయి. ఓటర్ల సంఖ్య 69, 513 నుంచి 77,0 48 కు పెరిగింది. తాడేపల్లిగూడెంలో వార్డుల సంఖ్య 35 నుంచి 40కి పెరిగాయి. ఓటర్ల సంఖ్య 8,60 49 నుంచి 98, 685కి పెరిగింది. పాలకొల్లులో వార్డుల సంఖ్య 31 నుంచి 35కి పెరిగింది. ఓటర్ల సంఖ్య తాజా లెక్కల ప్రకారం 75, 931 చేరింది. భీమవరంలో వార్డుల సంఖ్య 35 నుంచి 39కి చేరగా.. ఓటర్ల సంఖ్య 1,42,000 నుంచి 1,65,000 కు పెరిగింది. చింతలపూడి నగర పంచాయతీలోని 20వార్డుల్లో 2,60, 059 మంది ఓటర్లు ఉండగా.. ఆకివీడు నగర పంచాయతీలోని 20వార్డుల్లో 25,792 మంది ఓటర్లు ఉన్నారు.