కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏర్పాటు చేసిన లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలోని రొయ్యల రైతులు కుదేలయ్యారు. మార్కెట్ మూతపడి.. రవాణా స్తంభించి.. మేతలు కరువై.. అనేక కారణాలతో నష్టాల పాలయ్యారు. ఎన్నడూ లేని విధంగా ఆక్వా రంగం పూర్తిగా పతనమైంది. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, ఆకివీడు, ఏలూరు, ఉండి, పాలకొల్లు, తణుకు, ఉంగుటూరు, నరసాపురం ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. దాదాపు 80శాతం చెరువుల్లో రొయ్యలు పట్టుబడికొచ్చి విక్రయానికి సిద్ధమైన సమయంలో లాక్ డౌన్ ప్రభావం కోలుకోలేని ఇబ్బందులకు గురిచేసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రొయ్యలకు రోజువారి మేత ఖర్చులకు డబ్బులు లేక చెరువులు వదిలేస్తున్నామంటూ ఆవేదన చెందుతున్నారు.
మార్చినెలలో రొయ్యలకు మేతలు సరిగా వేయక పోవడం వల్ల.. పెరుగుదల ఆగిపోయింది. మార్కెట్లో మందులు,మేతలు అందుబాటులో లేక వ్యాధులతో రొయ్యలు తుడిచిపెట్టుకుపోయాయి. మూడు నెలలు తిరిగేసరికి వంద కౌంట్ రావాల్సిన రొయ్య నాలుగు నెలలైనా రాలేదంటూ రైతులు వాపోతున్నారు. ఎకరం చెరువులో రొయ్యలు సాగు చేయడానికి దాదాపు మూడున్నర లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే వచ్చిన ఆదాయం 50వేల రూపాయలు మించి లేదని రైతులు చెబుతున్నారు. ఎకరాకు మూడు లక్షల నష్టం మిగిలిందని, అప్పులు చెల్లించడానికి చేతిలో చిల్లి గవ్వలేక, తిరిగి పంటసాగుచేసేందుకు అప్పులు దొరక్క రొయ్యల రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఎగుమతి అవకాశాలు నిలిచిపోయిన ప్రస్తుత తరుణంలో స్ధానికంగానైనా మంచి ధర దక్కేలా చూడాలని, మార్కెట్ వసతులు కల్పించి, నష్టాల నుంచి తమను గట్టెక్కించాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి