పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నివాసంలో రెండు నెలల కిందట చోరీకి పాల్పడిన.. అంతర్రాష్ట్ర దొంగలు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.51.60 లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణనాయక్ వివరాలను వెల్లడించారు.
దొంగతనం ఇలా జరిగింది
నరసాపురంలో ఉంటున్న హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ సీహెచ్ సోమయాజులు.. గత నవంబరు నెలలో హైదరాబాద్ వెళ్లారు. అదే నెల 10న రాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి రూ.70.5లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాలు అపహరించారు.
విచారణ:
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఘటనాస్థలంలోని వేలిముద్రలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అవి ఓ పాతనేరస్థుడి వేలి ముద్రలుగా నిర్ధరించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కొంకాపల్లికి చెందిన పతివాడ లోవరాజు నేరం చేశాడని తేల్చారు. ఇతను శ్రీకాకుళం జిల్లా టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఓ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు.
పాలకొల్లు, నరసాపురం రోడ్డులోని దిగుమర్రు బైపాస్ వద్ద పతివాడ లోవరాజు, అతని స్నేహితుడు షేక్ నుమాన్ అహ్మద్‌ను సోమవారం అరెస్టు చేశారు. జైల్లో పరిచయమైన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ వాసి షేక్ నుమాన్ అహ్మద్‌కు... లోవరాజు కొన్ని నగలు ఇచ్చినట్లు విచారణలో తెలిసింది. నుమాన్ అహ్మద్ బంధువైన షేక్ సయ్యద్ తాబీజ్ వద్ద కూడా చోరీ చేసిన కొన్ని నగలను ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. ఇతని నుంచి సుమారు 21 కాసుల నగలను స్వాధీనం చేసుకోవాల్సి ఉందని తెలిపారు.
వ్యసనాలకు బానిసై..చోరీలకు అలవాటు పడి
నిందితుడు లోవరాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక దొంగతనాలకు పాల్పడ్డాడు. వ్యసనాలకు బానిసై చదువు మానేశాడు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో శిక్ష కూడా అనుభవించాడు. విజయవాడ, అమలాపురం, కాకినాడ, విజయనగరం, హైదరాబాదు ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడినట్లు వివరించారు.
ఇదీ చదవండి: