ఏలూరు నగర మేయర్‌గా షేక్ నూర్జహాన్ ఎన్నికయ్యారు. కార్పొరేటర్లందరూ ఆమె పేరును ఏకగీవ్రంగా ఆమోదించటంతో ఎన్నిక లాంఛనమైంది.. దీంతో వరుసగా రెండోసారి ఆమె మేయర్ పీఠాన్ని అధిష్ఠించారు. డిప్యూటీ మేయర్లుగా గుడిదేసి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్‌బాబులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ ప్రక్రియ సాగింది. ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్సీ షేక్ సాబ్జి తదితరులు హాజరయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, ప్రిసైడింగ్ అధికారి కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. ముందుగా కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కౌన్సిల్ హాల్లో మేయర్‌గా ఎవరిని ప్రతిపాదిస్తున్నారని కలెక్టర్ కార్పొరేటర్లను అడిగారు. ఇద్దరు కార్పొరేటర్లు నూర్జహాన్ పేరును బలపరిచారు. వైకాపా బీ ఫాం కూడా నూర్జహాన్‌కు ఇచ్చినందున ఆమె ఎన్నిక ఏకగ్రీవమైందని కలెక్టర్‌ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయర్లను వైకాపా కార్పొరేటర్లందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్లతో కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
తొలుత మేయర్ పదవికి నూర్జహాన్‌ను కార్పొరేటర్ సబ్బం శ్రీను(9వ డివిజన్), పప్పు ఉమామహేశ్వరరావు(30వ డివిజన్) బలపరచటంతో కార్పొరేటర్లందరూ ఆమోదించారు. డిప్యూటీ మేయర్ పదవికి గుడిదేసి శ్రీనివాసరావును వీరవెంకట నాగలక్ష్మి స్రవంతి ప్రతిపాదించగా మరో కార్పొరేటర్ కిలాడి జ్యోతి బలపరిచారు. మరో డిప్యూటీ మేయర్ పదవికి నూకపెయ్యి సుధీర్‌బాబు పేరును గరికపూడి ఇమ్మానుయేలు జైకర్ ప్రతిపాదించగా సుంకర చంద్రశేఖర్ బలపరిచారు. దీంతో నగర మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నికల లాంఛన ప్రాయంగా పూర్తయ్యింది.
రెండో ఉపాధ్యక్షుల ఎన్నిక
శుక్రవారం జిల్లాలోని పలు పురపాలక సంఘాలకు రెండో ఉపాధ్యక్షుని ఎన్నిక నిర్వహించారు. కొవ్వూరు పురపాలక సంఘానికి గండ్రోతు అంజలీకుమారి, జంగారెడ్డిగూడెంకు ముప్పిడి వీరాంజనేయులు, నిడదవోలుకు బాలరాజు, నరసాపురానికి కామన నాగిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రెండో డిప్యూటీ మేయర్లు, ఉపాధ్యక్షుల ఎన్నిక..
రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్లు, పురపాలక సంస్థ/ నగర పంచాయతీల్లో రెండో ఉపాధ్యక్ష పదవులకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఇందులో 12 నగరపాలక సంస్థల్లో రెండో డిప్యూటీ మేయర్లు, 73 పురపాలక/ నగర పంచాయతీల్లో ఉపాధ్యక్ష పదవులను అధికార వైకాపా దక్కించుకుంది. మెత్తమ్మీద 85 మంది మియామకంలో భాగంగా బీసీలు 24(28శాతం), ఎస్సీలు 22(26శాతం), ఓసీలు 37 శాతం 37(44శాతం) మందికి అవకాశం ఇచ్చినట్లు అధికార పార్టీ ప్రకటించింది.
- పెద్దాపురం, సామర్లకోట, ఏలేశ్వరం మున్సిపాలిటీల్లో రెండో వైస్ చైర్మన్‌గా మహిళలును ఎన్నుకొన్నారు. గొల్లప్రోలు వైస్ చైర్మన్‌గా గంధం నాగేశ్వరావు ఎంపికయ్యారు. ఏలేశ్వరం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌గా మసరపు బుజ్జి ఎన్నికయ్యారు. సామర్లకోట మున్సిపల్ వైస్ పర్సన్..గోకిన సునేత్ర దేవి, పెద్దాపురం మున్సిపల్ వైస్ పర్సన్‌గా కనకాల మహాలక్ష్మి ఎన్నికయ్యారు.
- పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ రెండో వైస్ చైర్మన్‌గా వెలగడ బాలరాజును సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- అమలాపురం మున్సిపాలిటీ రెండో వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజును ఎన్నుకున్నారు.
- విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపల్ రెండో వైస్ చైర్మన్‌గా ఆరేపు గుప్తాను వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ రెండో డిప్యూటి మేయర్‌గా 7వ డివిజన్ కార్పొరేటర్ షేక్ సజిలా ఎన్నికయ్యారు.
- పార్వతీపురం పురపాలక సంఘం రెండో వైస్ చైర్మన్ గుణేశ్వర రావును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- అనంతపురం పట్టణ నగరపాలిక రెండో ఉప మేయర్‌గా కోగటం విజయభాస్కర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- కదిరి మున్సిపాలిటీ రెండో వైస్ చైర్మన్‌గా రాజశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగాఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
- మడకశిర నగర పంచాయతీ రెండో వైస్ చైర్మన్‌గా వెంకట లక్ష్మమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- గుంతకల్లు మున్సిపాలిటీ రెండో వైస్ చైర్మన్‌గా నైరుతి రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
- ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ రెండో వైస్ చైర్మన్ రాచపూడి మాణిక్యరావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పలువురు అభిమానులు నగర పంచాయతీ కార్యాలయం ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
- ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ రెండో వైస్ చైర్మన్‌గా శికాకొల్లిరామను సభ్యులు ఎన్నుకున్నారు.
- నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘ వైస్ చైర్మన్‌గా శాతారాసి బాలయ్య ఎన్నికయ్యారు.
- నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం వైస్ చైర్మన్‌గా జలదంకి వెంకటకృష్ణారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- చిలకలూరిపేట పురపాలక సంఘం రెండో వైస్ చైర్మన్‌గా వలేటి వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- నందిగామ నగర పంచాయతీ రెండో వైస్ చైర్మన్‌గా ఫోర్సు లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం రెండో వైస్ చైర్మన్‌గా జంగం పాంషావలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘం వైస్ చైర్మన్‌గా లాభాల స్వర్ణ మణినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సామాజిక న్యాయం చేశాం..
నగరపాలక సంస్ధలు, పురపాలక సంస్ధల్లో రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్ ఛైర్మన్‌ల పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటించినట్లు ప్రభుత్వం తెలిపింది. 56 శాతం పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినట్లు వెల్లడించింది. రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్ ఛైర్మన్ పదవుల్లోనూ పూర్తి సామాజిక న్యాయం పాటించినట్లు పేర్కొంది.
85 నగరపాలక, పురపాలక సంస్ధలకుగాను 24 చోట్ల బీసీ, 22 ఎస్సీ, 2 ఎస్టీలను, ఇతరులను 37 చోట్ల రెండో డిప్యూటీ మేయర్, వైస్‌ఛైర్మన్‌ల ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. బీసీలు 28 శాతం, ఎస్సీలు 26 శాతం, ఎస్టీలు 2 శాతం ఎన్నికవగా, ఇతరులు 44 శాతం ఎన్నికయ్యారు. ఇప్పటికే నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నియామకాలు చేపట్టగా.. రెండో డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్‌ల ఎన్నికలోనూ అదే సంప్రదాయం కొనసాగిందని అధికార పార్టీ నాయకులు తెలిపారు.