పేద ప్రజల రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో ధర్నా చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెదేపా కార్యకర్తలు, మహిళలు ఆందోళన చేపట్టారు. స్పందన కార్యక్రమంలో వినతి పత్రాలు అందించారు. అర్హులందరికీ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నియోజకవర్గంలో తొలగించిన పంతొమ్మిది వందల పింఛన్లను పునరుద్ధరించాలని, ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని అన్నారు. పెన్షన్ దారులకు తెదేపా అండగా ఉండి పోరాడుతుందన్నారు.
అర్హులైన వారందరికీ పింఛన్లు అందించే దాకా తమ పోరాటం ఆగదని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమామహేశ్వరనాయుడు స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోనూ పింఛన్లను పునరుద్దరించాలంటూ ధర్నా చేశారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో పింఛన్ల రద్దుపై తెదేపా నేతలు మండిపడ్డారు. తొలగించిన పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.. సాలూరు పట్టణ మున్సిపల్ ఆఫీసు వద్ద పింఛన్లు కోల్పోయిన వారితో ధర్నా చేశారు.
ఇదీ చదవండి: పింఛన్ల తొలగింపును నిరసిస్తూ విజయవాడలో ర్యాలీ