పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వైశాఖ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామి వారి నిత్య కల్యాణ మండప ఆవరణను పుష్ప మాలికలతో అలంకరించారు. మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికను మామిడి తోరణాలు, అరటి బోదెలతో సుందరీకరించారు. ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను ఒక వాహనంపై ఉంచి అలంకరణ చేసి.. అర్చకులు హారతులు పట్టారు. వేద మంత్రోచ్ఛారణలతో స్వామి అమ్మవార్లు కొలువై ఉన్న వాహనాన్ని కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు.
వేదికపై ఏర్పాటు చేసిన సువర్ణ సింహాసనంపై స్వామి అమ్మవార్ల మూర్తులను ఉంచి ప్రత్యేక అలంకారాలు చేశారు. అనంతరం విశేష పూజాదికాలను జరిపారు. వేద మంత్రోచ్ఛారణలతో స్వామి అమ్మవార్లను.. కళ్యాణానికి ముస్తాబు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరోనా నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో అర్చకులు, పండితులు, సిబ్బందితో ఆలయ ఈవో సతీసమేతంగా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వైభవంగా గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు... మోహినీ అవతారంలో స్వామి దర్శనం