గంజాయి సేవిస్తున్న పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చింతలపూడిలో యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై గంజాయితో పట్టణంలోని ఓ హోటల్ వద్దకు వచ్చారు. సాధారణ దుస్తుల్లో వెళ్లిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా ఎవరెవరు గంజాయి సేవిస్తున్నారనే వివరాలు సేకరించారు. అందులో నివ్వెరపోయే విషయాలు బయటికి వచ్చాయి.
గంజాయి సేవిస్తున్న పది మందిని అరెస్టు చేశారు. అందులో ముగ్గురు మైనర్లు ఉన్నారని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవి కిరణ్ తెలిపారు. జల్సాలకు అలవాటుపడిన వీరంతా గంజాయి సేవిస్తూ, తెలిసిన వారికి విక్రయిస్తున్నారని వెల్లడించారు.
వారి నుంచి రెండు కేజీల గంజాయి, 12 సెల్ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, రూ.3500 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిని చింతలపూడి కోర్టులో హాజరుపరిచామన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
Drug addiction : మీ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారా..? ఇలా తెలుసుకోండి