పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో నిబంధనలకు విరుద్ధంగా స్వామివారికి తలనీలాలు సమర్పించే కార్యక్రమం నిర్వహించడం వివాదాస్పదమైంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను ఓ క్షురకుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి క్షవరాలు చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
లాక్డౌన్ నేపథ్యంలో ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో దర్శనాలు, కేశ ఖండనశాల కార్యకలాపాలను దేవస్థానం పూర్తిగా నిలిపివేసింది. స్వామి వారికి నిత్యకైంకర్యాలు మాత్రమే జరిపిస్తున్నారు. అయితే ఓ క్షురకుడు కొన్ని రోజుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా స్థానిక శ్రీ శ్రీనివాస కళాశాల వెనుక నిర్మానుష్యంగా ఉన్న స్థలంలో భక్తుల తలనీలాలు తీసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. భక్తులు గుంపులుగా అక్కడకు చేరుకుని తలనీలాలు సమర్పిస్తున్నారు. అతను భక్తులకు గుండు కొట్టి అందినంత దోచుకుంటున్నాడు. ఈ విషయం వెలుగులోకి రావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ క్షురకుడ్ని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి