పశ్చిగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నార్ని వెంకటేశ్వరావు అనే వ్యక్తిని దంతలూరి మణికంఠ వర్మ, అతని స్నేహితులు కలిసి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లిగూడెం పట్టణంలోని కోతి బొమ్మ సెంటర్‌కు చెందిన నార్ని వెంకటేశ్వరరావుకు (44 )రెండు లారీలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం చింతపల్లి గ్రామానికి చెందిన దంతులూరి మణికంఠ వర్మ తాడేపల్లిగూడెంలో ఉంటూ వెంకటేశ్వరరావుతో కలిసి వ్యాపారం చేస్తున్నాడు. వెంకటేశ్వరరావు తనకున్న రెండు లారీల్లో ఒక లారీని ఐదు నెలల క్రితం మణికంఠ వర్మకు కంటిన్యూస్ ఫైనాన్స్ కింద ఇచ్చాడు. మణికంఠ వర్మ లారీ ఫైనాన్స్‌కు సంబంధించిన వాయిదాలు సరిగా కట్టకపోవటంతో ఫైనాన్స్ సంస్థ వారు వెంకటేశ్వరరావును ప్రశ్నించారు. అతను మణికంఠను మందలించి తన లారీ తనకు ఇచ్చేయమని ఒత్తిడి చేశాడు. వెంకటేశ్వరావును చంపేస్తే రెండు లారీలు తన సొంతం అవుతాయని అనుకున్నాడు మణికంఠ. విషయాన్ని తన స్నేహితులతో చర్చించాడు.
పథకం ప్రకారమే.... పిలిపించి చంపారు
ఈనెల 7వ తేదీ ఉదయం పని ఉందని వెంకటేశ్వరరావును కారులో మణికంఠ భీమవరం తీసుకెళ్లారు. అక్కడ ఓ బార్లో నిద్రమాత్రలు కలిపిన మద్యాన్ని వెంకటేశ్వరరావుతో తాగించారు. అనంతరం అదే కారులో ఉంగుటూరు మండలం రావులపర్రు సమీపంలోని వంతెనను ఆనుకుని ఉన్న కాగుపాడు వెళ్లే రహదారిపై ఆగారు. ముందుగానే కొనుగోలు చేసిన తలగడతో నలుగురు కలిసి నార్ని వెంకటేశ్వరరావు ముఖంపై ఉంచి ఊపిరిరాడకుండా చేసి హత్య చేశారు. అక్కడి నుంచి ప్రధాన కాలువపై నాచుగుంట వద్ద ఉన్న వంతెనపై నుంచి మృతదేహాన్ని కాలువలో పడేసి వెళ్లిపోయారు. ఈనెల ఎనిమిదో తేదీన వెంకటేశ్వరరావు మృతదేహం చేబ్రోలు వద్ద లభ్యం కావటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గణపవరం సీఐ డేగల భగవాన్ ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.