మామిడి రైతులు, వ్యాపారుల అవసరాల దృష్ట్యా.. విజయనగరం నుంచి దిల్లీలోని ఆదర్శనగర్ మార్కెట్‌కు రైల్వేశాఖ ప్రత్యేక కిసాన్ పార్శిల్ రైలు నడుపుతోంది. ఈ నెల 17 నుంచి నడుస్తున్న ఈ ప్రత్యేక రైలును వాల్తేరు డివిజన్ అధికారులు రెండ్రోజులకోసారి నడుపుతున్నారు. ఈ రైలు విజయనగరంలో తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి, మరుసటిరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు దిల్లీకి చేరుతుంది. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, పార్వతీపురంతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
జూన్ 15 వరకు ప్రత్యేక కిసాన్ రైలు సేవలు..
స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించి ఈ రైలు సేవలను వినియోగించుకోవచ్చని వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోనే.. మామిడి రైతులను, ఆదుకునేందుకు రైల్వేశాఖ ముందుకొచ్చిందని.. ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మూడు దఫాలుగా సుమారు.. 600 టన్నుల పంట ఇక్కడి నుంచి దిల్లీకి ఎగుమతి జరిగింది. ఈ ప్రత్యేక కిసాన్ రైలు సేవలు.. జూన్ 15 వరకు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.
30 నుంచి 40 శాతం తగ్గిపోయిన దిగుబడి..
మామిడి విస్తీర్ణం, దిగుబడుల్లో విజయనగరం జిల్లా.. రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. ఇక్కడ బంగినపల్లి, సువర్ణరేఖ, పనుకులు, రసాలు.. చెరుకు రసం వంటి రకాలు జిల్లాలో ప్రసిద్ధి. అయితే ఈ ఏడాది మంచు అధికం కావటంతో పూతకు ఫంగస్ వచ్చిందని రైతులు చెబుతున్నారు. సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ.. పురుగు అదుపులోకి రాకపోవటంతో దిగుబడులు 30 నుంచి 40 శాతం తగ్గిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పదేళ్లలో ఇంతటి దారుణమైన పరిస్థితి చూడలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతికూల పరిస్థితులు, తెగుళ్ల బెడద కారణంగా పంట నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం అండగా నిలవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి..