గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై.. విజయనగరం జిల్లా డీఎస్పీ ప్రయాణిస్తున్న వాహనం మంటల్లో చిక్కుకుంది. విజయనగరం జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ శ్రీనివాసరావుకు.. విజయవాడ కనకదుర్గమ్మ వారి నవరాత్రుల ఉత్సవాల బందోబస్తు విధులు కేటాయించారు. మధ్యాహ్నం విధులు ముగించుకొని గుంటూరుకు వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న ఏపీ18పీ 0778 వాహనంలో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. అక్కడినుంచి కొంచెం ముందుకు వెళ్లగానే.. పొగలు ఎక్కువయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ అశోక్, డీఎస్పీ శ్రీనివాసరావు వెంటనే వాహనం దిగేశారు.
సమాచారం అందుకున్న మంగళగిరి అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. జాతీయ రహదారిపై వాహనం దగ్ధమవ్వటంతో.. వాహన రాకపోకలను సర్వీస్ రోడ్డులోకి మళ్లించారు. విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:
భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చు: ప్రభుత్వ సలహాదారు సజ్జల