విజయనగరంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ వెల్లడించారు. విజయనగరానికి ప్రశాంతమైన జిల్లా అని పేరుందని.. దాన్ని నిలబెట్టేందుకు ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని.. ప్రలోభాలపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణ, తదితర ఏర్పాట్లపై ‘ఈనాడు-ఈటీవీ భారత్'తో ఆయన ముఖాముఖిలో వెల్లడించారు.
ఆ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు..
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 274 సమస్యాత్మక, 166 అతి సమస్యాత్మక, 59 తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, వెళ్లడానికి వీల్లేని గ్రామాలు 11 వరకు గుర్తించాం. అక్కడ పోలింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లను, వీడియోగ్రాఫర్లను, అదనపు బందోబస్తును నియమిస్తున్నాం. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశాం. అధికారులు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకొనేలా అవగాహన కల్పించడంతో పాటు కొండ ప్రాంతాల్లోని వారు కేంద్రాలకు చేరుకొనేలా వాహన సదుపాయం కల్పిస్తున్నాం.
రెండింటికీ సమ ప్రాధాన్యం..
ఎన్నికలు, కొవిడ్.. రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఓటర్లు, సిబ్బంది ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 1.20 లక్షల మాస్కులు సిద్ధం చేశాం. సిబ్బందికి గ్లౌజులు, పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నాం. ఓటర్లకూ అవగాహన కల్పిస్తున్నాం.
ఎస్‌ఈసీ దిశానిర్దేశం తప్పనిసరి..
ప్రభుత్వ ఉద్యోగులంతా ఎన్నికల సంఘం పరిధిలోనే పని చేయాలి. ఎవరూ సొంత నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులకు గురికావొద్ధు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇచ్చాం. ఎన్నికల కమిషన్ దిశానిర్దేశాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పాం. ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించాం. మూడు విడతలకు కలిపి 23,364 మంది సిబ్బందిని వినియోగిస్తున్నాం. ఇందుకు ఆర్వోలు 959, పీవోలు 10012, వోపీవోలు 12393లను నియమించాం.
99 కేంద్రాల మార్పు..
కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల్లో నాడు-నేడు, ఇతర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జిల్లాలో 99 కేంద్రాలను మార్చాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపించాం. కొన్ని గ్రామాల్లో అసలు భవనాలు లేవు. అలాంటిచోట్ల తాత్కాలికంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
వలస వెళ్లిన వారు రావాలి..
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు ఎన్నికల రోజున సొంతూళ్లకు రావాలి. గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ఐదేళ్లకోసారి వచ్చే ఈ అవకాశాన్ని ఎవరూ జారవిడుచుకోవద్ధు
వేలం పాటలపై దృష్టి:
గ్రామస్థులంతా కూర్చొని చర్చించుకొని ఏకగ్రీవాలు చేసుకుంటే బాగుంటుంది. అలాంటి గ్రామాలకు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఇస్తుంది. అలా కాకుండా వేలం పాటలు నిర్వహించి ఏకగ్రీవాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఓటర్లు స్వేచ్ఛగా ఓటేసేలా, నగదు, బహుమతుల పంపిణీ జరగకుండా చూస్తున్నాం. నిఘాకు ప్రత్యేకంగా షాడో బృందాలను ఏర్పాటు చేశాం. ఇలాంటివి మా దృష్టికి వస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.
పుకార్లు నమ్మొద్దు..
కొందరు తప్పుడు సమాచారంతో పక్కదారి పట్టిస్తుంటారు. అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ఇతరుల భావోద్వేగాలతో లబ్ధి పొందే అవకాశం ఉంది. పుకార్లను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవు.
ఇదీ చదవండి: