మహారాజా కళాశాలను ప్రైవేట్‌పరం చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ, పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయనగరం ఎంఆర్ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి...ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని వేల మందికి నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తున్న కళాశాల ఎంఆర్ అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రామ్మోహన్ రావు అన్నారు. అటువంటి కళాశాలను ప్రైవేటీకరణ చేయటమంటే... విద్యను వ్యాపారంగా మార్చి పేద, సామాన్య విద్యార్థుల నుంచి డబ్బులు దోచుకోవడం తప్ప వేరే ఆలోచన కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎంతోమంది మేధావులు, అభ్యుదయవాదులను, రాజకీయ నేతలను అందించిన ఈ కళాశాల... ఇప్పుడు ప్రైవేటుపరం కావడం దౌర్భాగ్యమని తమ ఆవేదనను వెలిబుచ్చారు. మాన్షన్ యాజమాన్యంపై, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత తీసుకువస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రామ్మోహన్రావు, పట్టణ పౌర సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నేడు.. వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాలకు సీఎం శంకుస్థాపన