విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజనులు నిరసన తెలియజేశారు. గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. కరడ వలస, జిల్లేడు వలస, సిరివర తదితర గ్రామాలకు బీటీ రోడ్లు వేయాలని కోరుతూ 54 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించి కార్యాలయానికి చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగింది.
గర్భిణీలు, అత్యవసర సమయాల్లో డోలీలలో మోసుకువెళ్లలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సమయాల్లో ప్రాణాలు పోతున్నాయని విచారించారు. తమ బాధను అర్థం చేసుకుని రోడ్లు వేయాలని ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పీఓ అందుబాటులో లేక గిరిజనులు రాత్రి వరకు నిరీక్షించారు. విషయం తెలుసుకున్న పీవో కూర్మనాథ వచ్చి గిరిజనులతో మాట్లాడారు. వారి విజ్ఞప్తికి పీఓ సానుకూలంగా స్పందించారు. పై అధికారులతో మాట్లాడి తమ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు