విజయనగరం జిల్లా గంట్యాడ మండలం డీకే.పర్తి గ్రామ పంచాయతీ పరిధిలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ.. గిరిజనలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం, తాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆకులు ధరించి, విల్లంబులతో ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి.. కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం గిరిజన సంప్రదాయ వేషదారణలతో ధర్నా చేపట్టారు.
డీకే పర్తి పంచాయతీ పరిధిలోని పది గ్రామాల్లో దశాబ్దాలుగా తాగునీటి సౌకర్యం లేదని గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొర అప్పలరాజు అన్నారు. గత రెండేళ్లుగా తాడిపూడి ప్రాజెక్టులో బోటు రవాణా నిలిచిపోవటంతో తమ గ్రామాలకు రవాణ సౌకర్యం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికంగా బోటు సదుపాయం లేకపోవటంతో అనంతగిరి మండలంలో 35కిలో మీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రానికి రావాల్సిన పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అయినా డీకే.పర్తి పంచాయతీ పరిధిలోని గ్రామాలపై ప్రభుత్వం దృష్టిసారించాలని గిరిజనులు కోరుతున్నారు. కనీసం తాగు, రహదారి సౌకర్యమైన కల్పించాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'తాజా పీఆర్సీపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు'