ఏడాదికిపైగా పాకిస్థాన్ జైల్లో మగ్గిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు... ఎట్టకేలకు చెర నుంచి విడుదలయ్యారు. నేడు భారత్‌లో అడుగుపెట్టనున్నారు. పొట్టకూటి కోసం గుజరాత్ వలస వెళ్లిన ఉత్తరాంధ్ర మత్స్యకారులు... వీరావల్‌లో చేపల వ్యాపారుల వద్ద పనిచేసేవారు. 2018 నవంబర్‌లో చేపల వేట వెళ్లిన 20 మంది పొరపాటున వీరావల్ తీరం నుంచి పాక్ జలాల్లోకి ప్రవేశించారు. వారిని ఆ దేశ సైన్యం బంధించి జైల్లో పెట్టింది. దాయాది దేశంతో.... కేంద్ర ప్రభుత్వ చర్చలతో ఎట్టకేలకు వారికి విముక్తి లభించింది. వారిని జైలు నుంచి విడుదల చేసింది.
తమ వాళ్లను విడిపించుకోవడానికి ఈ సంవత్సరం పాటు గల్లీ నుంచి దిల్లీ వరకు అందరికీ మొరపెట్టుకున్నారా మత్స్యకార కుటుంబ సభ్యులు. ఎడతెగని పోరాటం చేశారు. పాక్ జైల్లో తమవారికి ఎలాంటి కీడు జరుగుతోందనని ఇన్నాళ్లూ బెంగపడ్డారు. కన్నీరుమున్నీరయ్యాయ. వారి పోరాట ఫలితం, కేంద్ర ప్రభుత్వ చొరవతో జాలర్లంతా విడుదలయ్యేసరికి.... ఆ కుటుంబ సభ్యులకు ఒక్కసారిగా ప్రాణాలు లేచొచ్చినట్లైంది.
పాక్ విడుదల చేసిన తెలుగువారిలో.... విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన... ఎస్.కిశోర్, నికరందాస్ ధనరాజ్, గరమత్తి, ఎం. రాంబాబు, ఎస్.అప్పారావు, జి.రామారావు, బాడి అప్పన్న, ఎం.గురువులు, నక్కా అప్పన్న, నక్క నర్సింగ్, వి.శామ్యూల్, వి.ఎర్రయ్య, డి.సురాయి నారాయణన్, కందా మణి, కోరాడ వెంకటేశ్, శేరాడ కళ్యాణ్, కేశం రాజు, భైరవుడు, సన్యాసిరావు, సుమంత్ ఉన్నారు.
ఇప్పటికే మత్స్యకారులందరినీ జైలు నుంచి విడుదల చేసిన పాక్... ఇవాళ సాయంత్రం పంజాబ్‌లోని వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించనుంది. వారిని తీసుకొచ్చేందుకు... మంత్రి మోపిదేవి వెంకటరమణ... వాఘా సరిహద్దుకు వెళ్లారు.
ఇవీ చదవండి